శివ..శివా.. సెలవుల్లేవు!
కర్నూలు(అర్బన్): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కలిసొచ్చిన రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిని జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 15వ తేది నాటికి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు 50 శాతానికి మించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సెలవు దినాల్లో కూడా పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని గ్రామాల్లో పన్నులను వసూలు చేయాలని సంబంధిత అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. కుటుంబంతో కలిసి శివరాత్రి పండుగ రోజున జిల్లాలోని ఏదో ఒక శైవ క్షేత్రానికి వెళ్లాలని ముందస్తు ప్రణాళికలకు రూపొందించుకున్న పంచాయతీ కార్యదర్శులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని మొత్తం 484 గ్రామ పంచాయతీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి పన్నుల రూపేణ ఆరియర్స్ రూ.2.53 కోట్లు, ప్రస్తుత పన్నులు రూ.16.65 కోట్లు (మొత్తం రూ.19.19 కోట్లు ) వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అరియర్స్ రూ.83 లక్షలు, ప్రస్తుత పన్నులు రూ. 8.94 కోట్లు వసూలు చేశారు. ఇంకా పన్నులకు సంబంధించి రూ.10.42 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. అలాగే పన్నేతరముల కింద అరియర్స్ రూ.1.36 కోట్లు, ప్రస్తుత ఏడాది డిమాండ్ మేరకు రూ.9.14 కోట్లు ( మొత్తం రూ.10.50 కోట్లు) వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు పన్నేతరముల అరియర్స్ రూ.30 లక్షలు, డిమాండ్ పన్నుల కింద రూ.3.69 కోట్లు (మొత్తం రూ.3.99 కోట్లు) వసూలు చేశారు. ఇంకా పన్నులు, పన్నేతరముల కింద జిల్లాలో దాదాపు రూ.16 కోట్లను వసూలు చేయాల్సి ఉంది.
పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి
ఈ నెల 15వ తేది నాటికి 50 శాతానికి మించి పన్నులు వసూలు చేయాలని పీఆర్‌అండ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి పెట్టారు. గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్ –4, 5 పంచాయతీ కార్యదర్శులు అనేక రకాల సర్వేలను చేయాల్సి ఉంది. ఈ నేఫథ్యంలోనే ఆయా సర్వేలను సకాలంలో చేయడంతో పాటు పన్నుల వసూళ్లకు టార్గెట్స్ ఇవ్వడం పట్ల వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు సంబంధించి కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, చిప్పగిరి, హోళగుంద, హాలహర్వి, తుగ్గలి, దేవనకొండ, పత్తికొండ, ఆస్పరి తదితర మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో పన్నులను వసూలు చేసేందుకు చాలా కష్టంగా ఉందనే అభిప్రాయాన్ని అక్కడి కార్యదర్శులు వ్యక్తం చేస్తున్నారు. పైగా జిల్లాలో మొత్తం 484 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో మేజర్ గ్రామ పంచాయతీల్లో బిల్ కలెక్టర్లు వన్నులను వసూలు చేస్తున్నారు. మిగిలిన మైనర్ గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులే పన్నులను వసూలు చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీలకు అనుగుణంగా కార్యదర్శులు కూడా లేకపోవడంతో పన్నుల వసూళ్లలో జాప్యం జరుగుతుందనే భావన వినిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో గ్రేడ్ –4 కార్యదర్శులు 150, గ్రేడ్ –5 కార్యదర్శులు 137 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
రెండో శనివారం, ఆదివారం
పనిచేయాల్సిందే
పన్నుల వసూళ్లపై మౌఖిక ఆదేశాలు
పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి
50 శాతం కంటే తక్కువ వసూళ్లు
ఉంటే దండన తప్పదని హెచ్చరికలు


