జైలులో జతకట్టి.. నేరాల బాటపట్టి!
పోలీసులకు చిక్కిన అంతర్‌రాష్ట్ర దొంగలు
కర్నూలు: హైదరాబాద్‌లోని మారేడుపల్లి బిజినమైన రఘు, సికింద్రాబాద్ నివాసి టమాటార్ శివసింగ్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ అక్కడి పోలీసులకు చిక్కి చెంచల్‌గూడ జైలుకు వెళ్లారు. అక్కడ వారి మధ్య పరిచయం పెరిగి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత జట్టుగా ఏర్పడి పలు ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. శివసింగ్ వయస్సు 25 ఏళ్లు కాగా ఇతనిపై 28 ఇంటి దొంగతనాలు, అలాగే రఘు వయస్సు 24 కాగా 15కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసు రికార్డులకెక్కారు. పక్కా ఆధారాలతో వీరిద్దరినీ నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు శివారులోని సంతోష్ నగర్‌లో నివాసముంటున్న మద్దిలేటి ఇంట్లో గత జనవరి 29న పట్టపగలే దొంగలు పడి అందినకాడికి మూటకట్టుకుని ఉడాయించారు. మద్దిలేటి ఓ ప్రైవేటు ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన విధులకు వెళ్లగా భార్య లక్ష్మీదేవి, కుమార్తె హేమచరిత ఇంటికి తాళం వేసి బస్టాండ్ సమీపంలోని ఓ బ్యాంకుకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలను తస్కరించారు. ఒక గంట సమయంలో తల్లీ కుమార్తె తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం తొలగించి ఉండటం, తలుపులు మూసి ఉండటంతో ఆందోళనతో తలుపులు తీయమని గట్టిగా అరిచారు. అప్పటికే బీరువాలోని సొత్తును దోచుకుని బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరు దుండగులు తలుపులు తీసి అడ్డంగా ఉన్న తల్లీ కూతుళ్లను పక్కకు నెట్టేసి పరారయ్యారు. కాస్త దూరంలో సిద్ధంగా ఉంచుకున్న ద్విచక్ర వాహనంపై దొంగలిద్దరూ పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేరం జరిగిన తీరును పరిశీలించారు. కాలనీలో ఓ చోట సీసీ కెమెరా ఫుటేజీలో దుండగులు చోరీకి ముందు ద్విచక్ర వాహనంపై కాలనీలో సంచరించిన దృశ్యాలను గుర్తించారు. సీఐ విక్రమసింహ, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు మురళీధర్, లక్ష్మీనారాయణ ప్రత్యేక బృందంగా ఏర్పడి కర్నూలు నుంచి షాద్‌నగర్ వరకు సీసీ ఫుటేజిలను క్షుణ్ణంగా పరిశీలించారు. తెలంగాణ పోలీసు అధికారులతో సమాచారాన్ని పంచుకుని మారేడుపల్లి బిజినమైన రఘు, సికింద్రాబాద్ నివాసి టమాటార్ శివసింగ్‌లుగా గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఉంచి గురువారం మునగాలపాడు గ్రామ శివారులోని సమ్మర్ స్టోరేజి ట్యాంకు సమీపాన బంజారా హిల్స్ వెంచర్‌లో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చోరీ సొత్తు విక్రయించి గంజాయి వ్యాపారంలో పెట్టుబడి
రఘు, శివసింగ్‌లపై తెలంగాణలో పోలీసుల నిఘా పెరగడంతో దృష్టి మరల్చేందుకు కర్నూలుకు వచ్చి బాలాజీ నగర్‌లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇకపై దొంగతనాలు మానుకుని గంజాయి వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నారు. చోరీ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి ఓ రహస్య ప్రదేశంలో దాచారు. ఈలోగా వారిపై కర్నూలు పోలీసులు నిఘా వేసి పట్టుకోవడంతో గంజాయి వ్యాపారం గుట్టు కూడా రట్టయింది. నిందితుల్లో ఒకరికి కర్నూలులో బంధువులు ఉండటంతో ఈ ఏడాది జనవరిలో కర్నూలుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శివసింగ్‌పై 2021లో పీడీ యాక్ట్ నమోదు కావడంతో చెంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించాడు. 2015లో శివసింగ్ మైనర్‌గా ఉన్నప్పుడు కర్నూలులో ఓ ద్విచక్ర వాహనం చోరీ చేసి పట్టుబడినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు.
సీసీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదింపు
చోరీ సొత్తు విక్రయించి వచ్చిన సొమ్ము
గంజాయి వ్యాపారానికి పెట్టుబడి
ఏడు తులాల బంగారు నగలు,
ద్విచక్ర వాహనం స్వాధీనం


