
కర్ణాటక: మానసిక అస్వస్థతతో బాధపడుతున్న ఓ మహిళ కుమార్తె ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన తుమకూరు నగరంలో చోటు చేసుకుంది. బనశంకరి సమీపంలో శివకుమార్, హేమలత దంపతులు నివాసం ఉంటున్నారు. శివకుమార్ గుబ్బి తాలూకాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీరి కుమార్తె తన్విత(6) ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి చదవుతోంది. హేమలత కొద్ది కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స చేయించుకుంటోంది.
శివకుమార్ రోజులాగే శుక్రవారం విధులకు వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న హేమలత తన కుమార్తెను గొంతుపిసికి హతమార్చింది. భర్తకు ఫోన్ చేసి అర్జెంట్‌గా రావాలని సూచించింది. ఆయన ఇంటికి వచ్చి చూడగా తన్విత విగతజీవిగా కనిపించింది. ఏం జరిగిందని ప్రశ్నించగా గొంతుపిసికి చంపేసినట్లు తెలియజేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి హేమలతను అరెస్ట్ చేశారు.