టెన్త్‌ విద్యార్థులకు ఉపశమనం | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థులకు ఉపశమనం

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

టెన్త్‌ విద్యార్థులకు ఉపశమనం

టెన్త్‌ విద్యార్థులకు ఉపశమనం

నేటి నుంచి అల్పాహారం ప్రారంభం

బాన్సువాడ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు ఉపశమనం లభించింది. ప్రభుత్వం వారికి సోమవారం నుంచి అల్పాహారం అందించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి ఏటా 3 నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. గత ఏడాది 38 రోజుల పాటు విద్యార్థులకు అల్పాహారం అందించగా ఈ సంవత్సరం ప్రత్యేక తరగతులు ప్రారంభమై నెలలు గడిచినా అల్పాహారం అందించలేదు. దీంతో ఉదయం సాయంత్రం విద్యార్థులు అర్థాకలితో ప్రత్యేక తరగతులకు హాజరయ్యారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఇంటి వద్ద టిఫిన్‌ తింటే తరగతులకు ఆలస్యం అవుతుందని తినకుండా వచ్చేస్తుంటారు. దీంతో చదువుకునే సమయంలో ఆకలి వేస్తుండటంతో చదువు ఒంటపట్టడం లేదని అల్పాహారం అందించాలని విద్యార్థులు కోరారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి అల్పాహారం అందించేందుకు సిద్ధమైంది.

పోషక విలువలతో కూడిన స్నాక్స్‌..

విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం ఉడికించిన శనగలు, పెసర్లు, బెబ్బర్లు, వేరుశనగ పల్లీలతో పాటు బెల్లం వంటి పోషకాలతో తయారు చేసిన మిల్లెట్‌ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడి, ఆలు బజ్జీ వంటివి రోజుకోరకం అందించేందుకు విద్యాశాఖ సన్నద్ధమైంది.

టెన్త్‌ విద్యార్థులు 13,225 మంది..

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాలు, ప్రయివేట్‌ పాఠశాలల్లో కలిపి మొత్తం 13వేల 225మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. కాని వాటిలో 182 జెడ్పీ హైస్కూల్స్‌లో చదువుకునే విద్యార్థులు సుమారు 7 వేల మంది ఉన్నారు. వీరికి మాత్రమే సాయంత్రం స్నాక్స్‌ స్కీం వర్తించనుంది. మార్చి 10 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఒక్కో విద్యార్థికి ప్రతిరోజూ రూ.15 ఖర్చు చేసేలా ఏర్పాట్లు చేశారు. అల్పాహారం అందించే రోజులు తగ్గించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. కనీసం ఫిబ్రవరి 1 నుంచైనా ప్రారంభించి పరీక్షలు పూర్తయ్యే వరకు అమలు చేయాల్సిందని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement