యూరియా పంపిణీపై రైతుల ఆందోళన
రుద్రూర్: మండల కేంద్రంలోని సింగిల్ విండో పరిధిలోని రైతులకు యూరియా పంపిణీ చేయడంలో సహకార సంఘం సిబ్బంది పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆదివారం ఆందోళన చేశారు. కొందరు రైతులకు మాత్రమే యూరియా పంపిణిలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం విండోకు యూరియా చేరుకున్నప్పటికీ, ఆదివారం పండుగ రోజు సైట్‌ను తెరిచి కొందరికి మాత్రమే పంపిణీ చేయాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా స్టాక్ ఉన్నట్లు శనివారం యాప్‌లో ఎందుకు చూపలేదని కార్యదర్శి గంగాధర్‌ను నిలదీశారు. సన్నిహితులకు మాత్రమే పంపిణీ చేయడానికి సెలవు రోజున కొందరిని పిలిపించి ఇస్తున్నారని మండిపడ్డారు. సుమారు రెండున్నర గంటల పాటు రైతులు ఆందోళన చేపట్టారు. కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, మండల వ్యవసాయ అధికారి తక్షణమే వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్తే అవసరం లేని మందులను అంట గట్టి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. యూరియా అందని రైతులు పేర్లు నమోదు చేసుకుని మరో విడత రాగానే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అంగీకారం మేరకు రైతులు శాంతించారు.
యూరియా పంపిణీపై రైతుల ఆందోళన


