దుబాయిలో లక్కంపల్లి యువకుడి మృతి
నందిపేట్: బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లిన నందిపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన పస్కరాజు(25) గుండెపోటు తో మృతి చెందాడు. కుటుంబీకులు, గ్రామస్తులు ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పస్కరాజు తండ్రి చిన్నప్పుడే మృతి చెందాడు. దీంతో కుటుంబ బారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లిన అతను బుధవారం ఉదయం బాత్‌రూంకు వెళ్లి గంట అయిన బయటకు రాకపోవడంతో తోటి పని చేసే వారు ఎంత పిలిచినా పలకకపోవడంతో వాష్‌రూంలు క్లీన్ చేసే వారికి సమచారం అందించారు. వారు బాత్‌రూం తలుపులు పగుల గొట్టి చూడగా నోటిలో బ్రష్‌తో కుప్పకూలి చనిపోయి ఉన్నాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాజు కుటుంబీకుల రోదనలు మిన్నంటుతున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని జాన్కంపల్లి ఖుర్దు గ్రామానికి చెందిన హరిచంద్(40) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. హరిచంద్ ఉపాధి నిమిత్తం నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల శివారులో పడకల్ గ్రామానికి ఆరు నెలల క్రితం వెళ్లాడు. శనివారం రాత్రి పడకల్ గ్రామ శివారులో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటన స్థలిలో మృతి చెందాడు.


