టోకెన్ సమ్మె రాజకీయ స్వార్థమే
భూపాలపల్లి అర్బన్: ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మె పూర్తిగా రాజకీయ స్వార్థంతో, కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ నిర్వహిస్తున్నదని బీఎంఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ విమర్శించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం ఒకరోజు సమ్మెలతో కార్మికులకు ఒరిగిందేమిటో సంఘాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు కోడ్‌లలో కార్మిక వ్యతిరేక అంశాలపై సవరణల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న బీఎంఎస్ ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు మద్దతు ఇవ్వదని స్పష్టం చేస్తూ, కార్మికులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమ్మెలో పాల్గొని నష్టపోవద్దని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు రాసకట్ల నర్సింగరావు, పాండ్రాల మల్లయ్య, కడారి శంకర్, నారాయణ, శీలం రాజు, ఓరం లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


