నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
● ముందుగా కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం
భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేడు (సోమవారం) జరగనుంది. మున్సిపాలిటీ పరిధిలో 30వార్డుల్లో గెలుపొందిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మెజారిటీ కలిగిన సభ్యులలో నుంచి చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక చేపడుతారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ఉదయం 10.30గంటలకు హాజరుకావాలని నోటీసులను కమిషనర్ అందించారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
కాళేశ్వరం: కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సులోచన కళాక్షేత్రం, నాట్య గురువు వేముల రాధిక సతీష్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. ఆదివారం కార్తికేయ, వర్ణిక, క్రితిక, శ్రీనిక, అదితి, మీనాక్షి, రితిక, చార్విక, జశ్విత, అక్షిత, హర్ష నందిని, నాగద్రితి, శిరీష, తనుశ్రీ, శ్రీజ వారి ప్రతిభను చాటారు. రాధిక శిష్య బృందం ప్రదర్శించిన విఘ్నేశ్వర కీర్తన, శివ పంచాక్షరి, శివాష్టకం, నీలకంఠ నిరంజన అంశాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డాక్టర్ ప్రేమ్ ఆధ్వర్యంలో శార్వాని కూచిపూడి బృందం ఆకట్టుకుంది.
నిరంతర విద్యుత్ సరఫరా
భూపాలపల్లి రూరల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్పీడీసీఎల్ భూపాలపల్లి సర్కిల్‌లో నిరంతర విద్యుత్ సరఫరా అందించామని సూపరింటెండింగ్ ఇంజనీర్ బి.మల్చూరునాయక్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని సబ్‌స్టేషన్‌ను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యుత్ పరంగా సర్కిల్ పరిధిలోని అన్ని శివాలయాలకు ముమ్మర ఏర్పాట్లు చేసి విద్యుత్ సరఫరా అందించామన్నారు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ వెలుగులతో ఆలయాలు ప్రకాశిస్తున్నాయని చెప్పారు. ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.
నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక


