అభయ హస్తం కాదది.. భస్మాసుర హస్తం | - | Sakshi
Sakshi News home page

అభయ హస్తం కాదది.. భస్మాసుర హస్తం

Feb 10 2026 7:47 AM | Updated on Feb 10 2026 7:47 AM

అభయ హ

అభయ హస్తం కాదది.. భస్మాసుర హస్తం

భూపాలపల్లి: కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని, 420 హామీలను అమలు చేయకపోతే వీపు చింతపండు చేస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన భూపాలపల్లి పట్టణంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చౌరస్తాలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఫిబ్రవరి రైతుబంధు ఇప్పటి వరకు పడలేదన్నారు. తులం బంగారం, రూ.4వేల పింఛన్‌, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీ, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, బతుకమ్మ చీరలు మీ ఎమ్మెల్యే సత్తన్న, సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చారా అని అడిగాడు. వెనుకట ఒకడు మొఖం బాగాలేక అద్దాన్ని పగులగొట్టిండట.. అట్లున్నది మన సీఎం పరిస్థితి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే లాగులో తొండలు చొర్రగొడుతా. గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటా.. అని అంటుండన్నారు.

అభివృద్ధి చేసిన గండ్ర ఈయన..

భూపాలపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసిన అసలు గండ్ర ఈయన(వెంకటరమణారెడ్డి) అని, ఇచ్చిన హామీలు అమలు చేయని గండ్ర ప్రస్తుత ఎమ్మెల్యే సత్యనారాయణరావు అని కేటీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి..

కాంగ్రెస్‌ది అభయ హస్తం కాదని, భస్మాసుర హస్తం అని కేటీఆర్‌ అన్నారు. భూపాలపల్లి ప్రజలకు హుషారు ఎక్కువ అని, ఈ నెల 11న జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తగిన బుద్ధి చెప్పి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్‌ కోరారు.

సీఎం వచ్చినా ఓట్లు రావు..

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రులు వచ్చారని, అయినప్పటికీ గాలి బీఆర్‌ఎస్‌ వైపు వీస్తుండటంతో భయపడి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చారని, అయినా కాంగ్రెస్‌కు ఓట్లు పడవని, ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులతో భూపాలపల్లిలో చేపట్టిన పనులను ఎమ్మెల్యే సత్యనారాయణరావు నిలిపివేయించి బుద్దారంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాడని అన్నారు. ఆయన భూపాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా లేక బుద్దారం గ్రామ సర్పంచా అని ప్రశ్నించారు. జిల్లాల పునర్విభజన అశాసీ్త్రయంగా జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో, జిల్లాలను తగ్గిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మేడారంలో ప్రకటించింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, మా జోలికి వస్తే నలిచి పారేస్తామని వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

ఫిబ్రవరి వచ్చినా రైతు భరోసా పడలే

420 హామీలు అమలు చేయకపోతే..

వీపు చింతపండు చేస్తాం

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

అభయ హస్తం కాదది.. భస్మాసుర హస్తం 1
1/1

అభయ హస్తం కాదది.. భస్మాసుర హస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement