నిబంధనలు తూచ్!
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లిలో ఏర్పాటుచేసిన ఎన్నికల బృందాలకు సదుపాయాలు కల్పించకపోవడంతో నామమాత్రంగా పనిచేస్తున్నాయి. మున్సిపాలిటీలో కనీసం అధికారులు ఎన్నికల కోడ్‌ను సక్రమంగా అమలు చేయడం లేదు. ప్రధాన రహదారిపై ఉన్నటువంటి రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు కూడా తొడగలేదు.
ఖర్చులపై నిఘా కరువు..
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులను ఎస్‌ఎస్‌టీ టీమ్ ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి. ప్రచారంలో భాగంగా జన సమీకరణ, అభ్యర్థులు, నాయకుల ప్రసంగాన్ని వీడియో తీయాల్సి ఉండగా.. 30 వార్డుల్లో ఎక్కడ కూడా వీడియో తీసిన సందర్భాలు లేవు. చెక్‌పోస్టుల వద్ద కూడా వీడియో రికార్డింగ్ లేకుండానే తనిఖీలు చేస్తున్నారు. బెల్ట్‌షాపుల తనిఖీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలు గురి చేయకుండా ఉండేందుకు కాలనీలో ఎఫ్‌ఎస్‌టీ టీమ్ నిత్యం గస్తీ నిర్వహించాల్సి ఉంటుంది. అధికారులు పూర్తిగా పార్టీల నాయకులకు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
సెల్‌ఫోన్‌లలో వీడియో..
ఎన్నికల పరిశీలనకు ఏర్పాటు చేసిన టీమ్‌లలో వీడియో గ్రాఫర్స్‌ను ఏర్పాటు చేయలేదు. వీడియోగ్రాఫర్‌కు ఇచ్చే డబ్బులను సొంత జేబులోకి వెసుకునేందుకు జిల్లా స్థాయి అధికారి ఒకరు మున్సిపల్ ఎన్నికల్లో జోక్యం చేసుకొని వీడియో గ్రాఫర్స్‌ను నియమించకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. ఎనిమిది మంది వీడియోగ్రాఫర్లకు ఇచ్చిన ఆర్డర్లను సైతం రద్దు చేసినట్లు సమాచారం. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని టీమ్‌లకు కేటాయించి తుతూ మంత్రంగా సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్డర్లు లేకుండా మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని ఎన్నికల పనులకు వినియోగించుకుంటున్నారు. వారికి వచ్చే పారితోషకాలను మిగుల్చుకునే పనిలో పడ్డారు.


