ఆహార కల్తీ నియంత్రణ అధికారుల తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలను శుక్రవారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వరుణ్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు జెడ్పీహెచ్‌ఎస్, ఎంపీపీఎస్, కేజీబీవీ, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలు, హాస్టళ్లలో ఆహారం తయారు చేసే సిబ్బందికి ఆహార భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. ఆహార తయారీ సమయంలో తప్పనిసరిగా హెడ్‌క్యాప్స్, గ్లోవ్స్ ధరించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. సిబ్బంది నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఆరోగ్య రికార్డులను నిర్వహించాలన్నారు. పిల్లల ఆరోగ్యం అత్యంత కీలకమని, నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఆహార భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఏవైనా లోపాలు కనిపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వరుణ్ రెడ్డి తెలిపారు.


