సోషల్ సందడి..
రోజుకు రూ.1500
మున్సిపల్ ప్రచార అస్త్రంగా సామాజిక మాధ్యమాలు
భూపాలపల్లి అర్బన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వం సోషల్ మీడియా వేదికగా వారం రోజుల నుంచే మొదలైంది. షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే ప్రధాన పార్టీలన్నీ సోషల్ మీడియాను తమ ప్రచార అస్త్రంగా చేసుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా హిందువుల సెంటిమెంట్‌ను ప్రధాన ప్రచార అస్త్రంగా బీజేపీ మలుచుకుంటోంది. ఆ పార్టీతో పాటు అనుబంధ సంఘాల పేరిట కూడా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఆ గ్రూపుల ద్వారా పరోక్ష ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను హైలెట్ చేస్తూ వార్డుల్లో తమ ప్రచారం చేస్తుంది. బీఆర్‌ఎస్ పార్టీ సైతం కాంగ్రెస్ పార్టీ వాగ్ధానాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. ప్రధాన పార్టీలన్నీ వార్డుల వారీగా ఓ వైపు పార్టీల పేరిట, మరో వైపు థార్మిక సంఘాలు, ఆధ్యాత్మిక యువజన సంఘాల పేరిట గ్రూపులను ఏర్పాటు చేయడంలో తలమునకలవుతున్నాయి. ప్రచారంలో సోషల్ మీడి యా పాత్ర అత్యంత కీలకంగా మారబోతోందని, ఈ ప్రచారమే ప్రధాన అస్త్రం అవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతీ ఓటరు వద్ద సెల్‌ఫోన్ ఉండడం.. సోషల్ మీడియాను విస్తృతంగా ఫాలో అవుతున్న కారణంగా వాట్సాప్ గ్రూపునకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలను సైతం పార్టీలు తమ ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నాయి.
వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం..
సోషల్ మీడియాను ప్రచార అస్త్రంగా మలుచుకునే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించుకొని గ్రూపులను ఏర్పాటు చేసుకొని ప్రచార పనిలో నిమగ్నమయ్యాయి. ఈ ఇన్‌చార్జ్‌లంతా తమ వార్డులోని పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులతో పాటు తమకు అనుకూలంగా వ్యవహరించే వారు అలాగే తటస్తులను సైతం గ్రూపులో సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఆయా పార్టీల ఇన్‌చార్జ్‌లే గ్రూపునకు అడ్మిన్లుగా వ్యవహరిస్తూ వారు మాత్రమే పోస్టులు పెట్టే విధంగా చూసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా సమన్వయకర్త వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌లతో టచ్‌లో ఉంటూ పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల తరఫున జారీ అయ్యే అన్ని ప్రకటనలను అలాగే పథకాల ప్రాధాన్యతను ఈ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యే వరకు ఈ ఇన్‌చార్జ్‌లు నిరాటంకంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి అన్ని రకాల పోస్టులను వైరల్ చేస్తూ తమ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించేందుకు కృషి చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారం చేసే యువకులకు ఆయా పార్టీల అభ్యర్థులు రోజుకు రూ.1500 చొప్పున పారితోషికం చెల్లిస్తున్నారు. కెమెరాలు, సెల్‌ఫోన్‌లలో వీడియో, ఫొటోలు తీసుకుంటూ ఇన్‌స్ట్రాగామ్ రీల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్‌ను వార్డు గ్రూపులు, ఓటర్లకు పంపించే పని చేస్తున్నారు. ఎన్నికల కారణంగా సోషల్ మీడియాపై పట్టున్న యువకులకు ఉపాధి సైతం లభిస్తుంది.
వార్డుల వారీగా గ్రూపులు ఏర్పాటు
వేదికలుగా వాట్సాప్, ఫేస్‌బుక్,
ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లు
అన్ని పార్టీల గ్రూపుల్లో వార్డుల ప్రజలు
మార్మోగుతున్న ప్రచారం
సోషల్ సందడి..


