సీఎం పర్యటనకు ఏర్పాట్లు
భూపాలపల్లి: ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, పొరపాట్లకు తావు ఇవ్వొద్దని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సీఎం పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్ల్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, వైద్య, విద్యుత్, అగ్నిమాపక, దేవాదాయ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటన సందర్భంగా శాఖల వారీగా నిర్వర్తించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్ వద్ద ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కొడవటంచ, చెల్పూరు హెలిప్యాడ్‌ల వద్ద అగ్నిమాపక సిబ్బంది తమ వాహనాలతో సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర వైద్యసేవల కోసం కొడవటంచలో సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలన్నారు. చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే సభా ప్రాంగణం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, చెల్పూరులో పబ్లిక్ మీటింగ్ జరిగే ప్రాంతంలో ఆయుష్ ఆస్పత్రిలో సేఫ్ హౌస్, మీటింగ్ ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్‌కు అవసరమైన వాహనాల ఏర్పాటు, సీఎం ప్రయాణానికి వినియోగించే వాహనాల ఫిట్‌నెస్ తనిఖీలు, అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొడవటంచ ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,వీఐపీల ప్రొటోకాల్, పురోహితులను నియమించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ర్యాండమైజేషన్ పూర్తి..
పురపాలక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించిన రెండో విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేస్తూ టీ–పోల్ పోర్టల్ ద్వారా ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు 104 మంది, ఏపీఓలు 104, ఓపీఓలు 312 మందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించి 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
పొరపాట్లకు తావివ్వొద్దు
కలెక్టర్ రాహుల్ శర్మ,
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


