లక్ష్యసాధనకు కృషి చేయాలి
భూపాలపల్లి అర్బన్: నిర్దేశించిన లక్ష్యాల సాధనకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యపరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లతో గురువారం డీఎంహెచ్‌ఓ తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసంక్రమిత వ్యాధులు, టీబీ, ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవితో కలిసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్పిరేషనల్ బ్లాక్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం కింద రాబోయే రోజుల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. టీబీ రహిత సమాజ నిర్మాణం దిశగా క్షేత్రస్థాయిలో తెమడ పరీక్షలు నిర్వహించాలన్నారు. మొబైల్ ఎక్స్‌రే యూనిట్ ద్వారా టీబీ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని ఆదేశించారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, సబ్ సెంటర్ల పరిధిలో నిర్వహించాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో నిర్వహించే వీహెచ్‌ఎన్‌డీఎస్ సమావేశాల్లో అంగన్‌వాడీ సిబ్బందితో పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ దేవేందర్, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి, టీబీ, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, దిశా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నీలిమ, సీఎస్‌ఓ సారయ్య, ఐసీటీసీ కౌన్సిలర్ గాదె రమేశ్, ఎస్‌ఎస్‌కే మేనేజర్ రజిని, టీబీ సూపర్‌వైజర్ ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ చల్లా మధుసూదన్


