స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించిన డీసీపీ | - | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించిన డీసీపీ

Feb 13 2026 3:15 AM | Updated on Feb 13 2026 3:15 AM

స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించిన డీసీపీ

స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించిన డీసీపీ

కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు

స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల బ్యాలెట్‌ బాక్సుల స్ట్రాంగ్‌రూమ్‌ను డీసీపీ రాజమహేంద్రనాయక్‌ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, శాంతిభద్రతలకు విఘాతం కల్గించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. డీసీపీ వెంట సీఐ జి.వేణు, ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ తదితరులున్నారు.

జనగామ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పా ట్లు చేసినట్లు ఏఎస్పీ పండేరి చేతన్‌ నితిన్‌ తెలి పారు. గురవారం పోలీసులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లో తగినంత పోలీసు బలగాల ను మోహరించి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు, అభ్యర్థులు, పార్టీల నాయకులు సహకరించి ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం: కమిషనరేట్‌ పరిధి జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాల వద్ద శుక్రవారం నుంచి నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా.. 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్‌ఎస్‌, సీఆర్‌పీసీ–163 ప్రకారం.. ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. ఈ నిషేధం నేడు (శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి

అదనపు కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత కీలకమైందని, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పారదర్శకంగా, కచ్చితంగా కౌంటింగ్‌ నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ పింకేశ్‌ కుమార్‌ సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఓట్ల లెక్కింపు జరుగనున్న స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కౌంటింగ్‌ కేంద్రాన్ని గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ప్రక్రియ ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాధాకృష్ణ, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement