శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, భీమండి, హనుమకొండ, వరంగల్ తదితర ప్రాంతాలకు కూలీ, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వలస వెళ్లిన ఓటర్లు పోలింగ్‌లో కీలకపాత్ర పోషించనుండటంతో పార్టీలన్నీ వారిని తిరిగి రప్పించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయి. వారికి రోజూ ఫోన్ కాల్స్ చేస్తూ మర్యాదపూర్వక
పలకరింపులు, చివరి రోజు ప్రత్యేక వాహనాల్లో
తరలించేందుకు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. వలస ఓటర్ల కోసం పోలింగ్ రోజు మినీ వాహనాలతో పాటే
ఏసీ లగ్జరీలను ఏర్పాటు చేసేలా ఆయా పార్టీలు ముందు అడ్వాన్స్‌లను సైతం ఇస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్, వరంగల్,
భీమండి ఓటర్లపై అభ్యర్థుల కన్ను
● ఓట్లు రాబట్టుకునేందుకు ‘ప్రత్యేక’ ప్రణాళికలు
● తమకే ఓటు వేయాలంటూ ఫోన్లు
● మందు, పైసలు, ప్రయాణ ఖర్చులు..అన్నీ భారీగానే!
జనగామ:
ఓట్ల కోసం పోల్ మేనేజ్‌మెంట్ రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. దూరప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగ, చదువురీత్యా ఉన్నవారి ఓట్ల కోసం అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారి ఓట్లను తమకే వేయాలంటూ ముందుగానే మాట తీసుకుంటున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు హామీ ఇస్తున్నారు. ప్రచార గడువు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ పురపాలికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్టీలు గెలుపు కోసం పోల్ మేనేజ్‌మెంట్ పేరిట భారీ వ్యూహరచనలో బిజీబిజీ అయిపోయారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి హామీలు అన్నీ పక్కనపెట్టి, ఓటును తమ గూటికి దించుకోవడమే ప్రధాన లక్ష్యంగా మిగిలింది.
కులాల వారీగా ఓటర్ల లెక్కలు..
ప్రత్యేక కమిటీలు
ప్రతీ పార్టీ కులాల వారీగా ఓటర్ల వివరాలు సేకరిస్తూ, పోల్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక బృందాలను మోహరించింది. ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఎవరికి మొగ్గు చూపుతున్నారో, ఎవరిని తమవైపు తిప్పుకోవాలో ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారు. సంఘాల వారీగా సమష్టి భోజనాలు, విందులు, సమావేశాలు ఈసారి ప్రచారాల్లో ప్రధాన హైలెట్‌గా మారింది.
డబ్బు పంపిణీకి
రహస్య ఏర్పాట్లు
ఎన్నికల సంఘం కంటపడకుండా డబ్బుల పంపిణీ విషయంలో పార్టీలు సీక్రెట్‌ను మెయింటెనెన్స్ చేస్తున్నాయి. ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో 8వ తేదీ అర్ధరాత్రి నుంచే వార్డుల వారీగా నమ్మకస్తుల ఇళ్లలో ‘మనీ డంపింగ్’ చేస్తున్నారనే సమాచారం ఉంది. చిన్న చిన్న మొత్తాల్లో ప్యాకెట్లు, పంపిణీ సమయంలో ఎక్కడా పట్టుపడకుండా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మద్యం, వెండి కాయిన్లు, గిఫ్టులు రెడీ
క్లస్టర్‌ల వారీగా భారీగా మద్యం డంపింగ్ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీదైన మందుబాటిళ్లు, వెండి నాణేలు, గిఫ్టులతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరికి వారే కొత్త ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటరే రాజు అంటూ చెప్పుకుంటూనే... లోపల మాత్రం ఓటును ‘మేనేజ్’ చేసేందుకు అభ్యర్థులు పట్టపగ్గాలు విప్పేశారు. ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి చర్చ కంటే, వ్యూహరచన, ఓటు మేనేజ్‌మెంట్, వలసఓటర్ల లెక్కలు, మద్యం, డబ్బు పంపిణీ ఇవే ప్రధాన అంశాలుగా మారుతున్నాయి. ఓటర్లు ఎవరి మాట నమ్ముతారు, ఎవరి వ్యూహం ఫలిస్తుందనే అసలు పోరు ఇప్పుడే మొదలు కానుంది.
స్టార్ క్యాంపెయినర్ల రాక
పురపాలిక ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ క్యామ మల్లేశం, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు. రాబోయే నాలుగు రోజుల పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, మాజీమంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితర ప్రముఖులు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణాలకు రానున్నారు. అన్ని పార్టీలు రోజుకు 5 నుంచి 8 వార్డులను చుట్టేస్తూ ప్రచారంలో స్పీడు పెంచారు. ర్యాలీలతో పాటు ఇంటింటి ప్రచారాన్ని తెల్లవారు జాము 5 గంటల నుంచే మొదలుపెడుతున్నారు.
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


