రంగా రంగా ప్రచార స్థలాన!
పురపాలిక ఎన్నికల్లో అభ్యర్థుల సందడి
జనగామ: పురపాలక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ పురపాలికల్లో బుధవారం నుంచి ప్రధాన పార్టీలన్నీ ప్రచార రంగంలోకి దిగడంతో వార్డులన్నీ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
రంగంలోకి
ముఖ్యనేతలు
ప్రచార రథాలు, బైకులు, ఆటోలు, పార్టీ బ్యానర్లు..ఇలా ప్రతి వీధిలోనూ నినాదాల ప్రతిధ్వని వినిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రధాన నేతలతో పాటు ఎమ్మెల్యేలు, సీనియర్ క్యాడర్, డివిజన్ స్థాయి నాయకులు కూడా బూత్‌ల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డుల వారీగా క్యాడర్ అభ్యర్థుల వెంట అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థులూ ప్రధాన పార్టీలకు సమానంగా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. వారికి వచ్చిన ఎన్నికల గుర్తులను చూపిస్తూ ‘తమ గుర్తుకు ఓటేయండి.. అభివృద్ధి కోసం మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి..’ అని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికీ తిరిగే స్వతంత్రులు ఓటర్లలో ఆప్యాయతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అవ్వా.. అమ్మా.. తాతా అంటూ..
ప్రచారంలో అభ్యర్థుల మాటతీరు కూడా ఓటర్లలో చర్చనీయాంశమైంది. ‘అమ్మా.. అవ్వా.. తాత.. ఎలా ఉన్నారు.. నేను ఫలానా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈసారి తప్పకుండా నాకు అశీర్వాదం ఇవ్వండి. మీరు పలికిన వెంటనే ముంగిట ప్రత్యక్షమవుతా.. ఐదు సంవత్సరాలు మీ పక్కనే ఉంటా.. అభివృద్ధి చేస్తా’ అంటూ భరోసా కల్పిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ..
వార్డుల వారీగా క్యాడర్ ఇంటింటికీ తిరుగుతుండగా, పలు సమయాల్లో అభ్యర్థులు మాత్రం ముఖ్యమైన ఓటర్ల ఇళ్లకు వ్యక్తిగతంగా వెళ్లి మద్దతు ఇచ్చి గెలిపించాలని విన్నవిస్తున్నారు. మరోవైపు పార్టీ లీడర్ల అలకలను, గ్రూపుల మధ్య చిన్న చిన్న విబేధాలను బుజ్జగించేందుకు అభ్యర్థులు విపరీతంగా శ్రమిస్తున్నారు. అలకలు పోవడం, వర్గాలు కలవడం, అభ్యర్థితో కలిసి ప్రచారంలోకి రావడం ఇవన్నీ ప్రచారంలో భాగమయ్యాయి.
తదుపరి రోజుకు నేటి రాత్రే ప్రణాళిక
ప్రధాన వీధులు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు పార్టీల ర్యాలీలతో కళకళలాడుతున్నాయి. హోటళ్లలో కూర్చున్న వారితో చేతులు కలుపుతూ షాప్‌లను సందర్శిస్తూ, మహిళలను పలకరిస్తూ ప్రతి ఓటరును ప్రేమ, ఆప్యాయతతో తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు బిజీబిజీగా గడుపుతున్నారు. పొద్ద ంతా ఊరేగింపులు, ర్యాలీలు చేసిన పార్టీల క్యాడర్ రాత్రికి తిరిగి పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు, తదుపరి రోజు వ్యూహరచన...ప్రచారం మరింత వేగం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజల్లో అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నప్పటికీ ఎవరి ప్రచారం ఎంత ప్రభావం చూపుతుందన్నది పోలింగ్ రోజునే తేలనుంది.
మైకుల హోరు..ఊరేగింపుల జోరు
పండుగ వాతావరణంలో వీధులు
పొద్దంతా ర్యాలీలు..రాత్రికి వ్యూహరచన
అమ్మా, అవ్వా, తాతా.. అంటూ
ఆకట్టుకునే యత్నం
రంగా రంగా ప్రచార స్థలాన!


