ఆరోగ్యకర జీవనశైలితో క్యాన్సర్ నియంత్రణ
జనగామ రూరల్: ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించవచ్చని జూనియర్ సివిల్ జడ్జి శశి అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి జిల్లా న్యాయ సేవా సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్సల ప్రాముఖ్యంపై రోగులు, ప్రజలకు అవగాహన కల్పించారు. సమయానికి స్క్రీనింగ్ చేయించుకోవడం, ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా క్యాన్సర్‌ను నియంత్రించవచ్చని సూచించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె.మల్లికార్జునరావు, ప్రోగ్రాం అధికారులు వైద్యులు అశోక్, కమల్ హసన్, ప్రభాకర్, మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు చరిష్మా
జఫర్‌గఢ్: మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన తాటికాయల చరిష్మా అనే విద్యార్థిని జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ సెక్రెటరీ శీలం పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చరిష్మా భీమారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నదన్నారు. బాక్సింగ్‌లో ప్రతిభ చాటడంతో 69వ ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థిని చరిష్మాను గ్రామస్తులు అభినందించారు.
దివ్యాంగులు సదరం
క్యాంపునకు హాజరుకావాలి
జనగామ రూరల్: దివ్యాంగులు యూడీఐడీ సదరం క్యాంపునకు హాజరుకావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వసంత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ రకాల దివ్యాంగులు కొత్తవారు, రెన్యూవల్ వారు మీ సేవలో యూడీఐడీ వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు రశీదులో ఉన్న ఫోన్ నెంబర్‌కు మెసేజ్ వచ్చిన తేదీల్లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం శిబిరానికి హాజరుకావాలన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి కొనసాగే ఈ శిబిరం 6,9,11,18,19,23,27వ తేదీల్లో ఆర్థో, దృష్టి, వినికిడి లోపం, మానసిక, తలసేమియా, క్రానిక్ న్యూరాలజీ, సంబంధిత దివ్యాంగులకు వైద్యులతో క్యాంపులు నిర్వహించబడుతాయన్నారు. కొత్తవి 225 ఉండగా, రెన్యూవల్ 65 ఉన్నాయని మొత్తంగా 290 మందికి అవకాశం ఉన్నదన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 8008202287లో సంప్రదించగలరని ఆమె సూచించారు.
‘ఐదేళ్ల అభివృద్ధిని
రెండేళ్లలో చేసి చూపించాం’
జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఐదేళ్ల అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించారని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తున్నారన్నారు.
కొనసాగుతున్న
ఇంటర్ ప్రాక్టికల్స్
జనగామ రూరల్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఉదయం జనరల్‌లో 582 విద్యార్థులకు గాను 573మంది హాజరయ్యారని, 9 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ మొత్తం 714 విద్యార్థులకు గాను 652 హాజరయ్యారని, 62 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జనరల్‌లో 497 విద్యార్థులకు గాను 487 మంది హాజరు కాగా, 10మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో మొత్తం 610 విద్యార్థులకు గాను 587మంది హాజరయ్యారని, 23మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
ఆరోగ్యకర జీవనశైలితో క్యాన్సర్ నియంత్రణ


