‘రెబల్స్’ బెడద
జనగామ రూరల్: జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఈ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల హంగామా.. రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. నామినేషన్ గడువు ముగియడంతో స్క్రూటినీ కూడా పూర్తయింది. ఇప్పుడు ఉపసంహరణ మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థుల మధ్య ఒత్తిడి, చర్చలు, రహస్య ఒప్పందాలు ఊపందుకున్నాయి. పార్టీ నుంచి టికెట్ ఆశించినా.. దక్కకపోవడంతో అసంతృప్తితో బరిలో దిగిన వారు, స్వతంత్రులు ఇప్పుడు అధికార, ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారారు. రెండేళ్లుగా కౌన్సిలర్ ఎన్నిక కోసం సిద్ధమవుతూ, తమ వార్డుల్లో పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టిన పలువురు నాయకులు ఇప్పుడు ఉపసంహరణపై మొగ్గు చూపడం లేదు. వారిని నచ్చజెప్పడానికి పార్టీ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రత్యేక ఆఫర్లు..
‘వార్డులోని తన అనుచరులను ఆకర్షించేందుకు ప్రతీ రోజు ఖర్చులు అయ్యాయి. ఇప్పుడు ఉపసంహరించుకోమంటే నా అభిమానులకు ఏమి చెప్పాలి’ అంటూ కొంతమంది రెబల్ అభ్యర్థులు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే వారిని ఒప్పించేందుకు పార్టీ శ్రేణులు ప్రత్యేక ఆఫర్లతో ప్రతిపాదనలతో ముందుకు వెళ్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే మధ్యవర్తుల ద్వారా రాజీకి సుముఖంగా ఉండగా, ఉపసంహరించిన తర్వాత ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఆఫర్లు క్లియర్ చేసే బాధ్యతను కూడా మధ్యవర్తులకే అప్పగిస్తున్నట్లు సమాచారం.
ఓట్ల విభజన జరగకుండా..
ఒక్క ఓటు గెలుపోటములు నిర్ణయించే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పోటీలో ఉన్నవారు రెబల్ కారణంగా ఓట్ల విభజన జరగకుండా చూడటానికి ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నా రు. ఇక ఉపసంహరణ గడువు సమీపిస్తున్న కొద్ది ఈ రెండు పురపాలికల్లో ఎన్నికల హీట్ మరింత పెరిగింది. రెబల్ అభ్యర్థుల నిర్ణయాలపై అన్ని పా ర్టీల దృష్టి నిలిచింది. ఏదిఏమైన రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉండటంతో ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
మున్సిపల్ ఎన్నికల్లో పెరుగుతున్న పొలిటికల్ హీట్
ఉపసంహరణకు రహస్య ఒప్పందాలు
పార్టీలకు తలనొప్పిగా మారిన
రెబల్ అభ్యర్థుల ప్రచారం


