బంగారు ఆభరణాల చోరీ
లింగాలఘణపురం: మేడారం జాతరకు వెళ్లిన వారి ఇంట్లో దొంగలు పడి 12 తులాల బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కళ్లెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం కూడా గ్రామంలో దొంగతనం జరిగి తులంన్నర బంగారం, నగదు దోపిడీ జరిగింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కళ్లెం గ్రామానికి చెందిన బుషిగంపల కంట్లం తన కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 27న మంగళవారం మేడారం జాతరకు వెళ్లాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా మేడారంలోనే ఉన్నారు. ఇంట్లో కోళ్లను కమ్మేందుకు తన చిన్నాన్న బాలనర్సయ్యకు గేటు తాళం ఇచ్చి వెళ్లాడు. కోళ్లను వదిలిపెట్టేందుకు బాలనర్సయ్య గురువారం గేటు తాళం తీయగా.. ఇంటి తాళం పగలగొట్టి కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన బాలనర్సయ్య వెంటనే కంట్లంకు ఫోన్‌లో సమాచారం అందజేశాడు. వెంటనే కుటుంబ సభ్యులంతా వచ్చి చూసేసరికి బీరువా తాళం తీసి అందులో ఉన్న రెండు బంగారు నక్లెస్‌లు, రెండు బంగారు గొలుసులు, రెండు ఉంగరాలు, చెవుల దుద్దులు ఇలా సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఫోరెన్సిక్ నిఫుణులతో వేలిముద్రలు సేకరించి విచారణ జరుపుతున్నారు. జాతర నేపథ్యంలో గ్రామాల్లో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు.
మేడారం జాతరకు వెళ్లిన ఇంట్లో
12 తులాలు మాయం
వరుస దొంగతనాలతో
కళ్లెంలో ఆందోళన


