ఉపాధి హామీపై కుట్రలు మానుకోవాలి
జనగామ రూరల్: ఉపాధి హామీ చట్టం నీరుగార్చే కుట్రలను ప్రధాని నరేంద్ర మోదీ మానుకోవాలని,
చట్టాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం చేస్తుందని ఏఐసీసీ సెక్రటరీ పి.విశ్వనాథన్ అన్నారు. సోమవారం మండలంలోని ఓబుల్‌కేశాపూర్ గ్రామంలో ఉపాధి హామీ చట్టం పేరు మార్పు, పథకాన్ని నిర్వీర్యంపై డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఏఐసీసీ సెక్రటరీ పి.విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. గాంధీ రాముడిని పూజించారని అలాంటి వ్యక్తి పేరును మార్చి పొరపాటు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. 2006లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో పేదలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మహాత్మాగాంధీ పేరు పెట్టారని అన్నారు. అలాంటి చట్టాన్ని రూపుమాపడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచి పెడుతోందని విమర్శించారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు.. కేరళ, తమిళనాడు మాదిరిగానే తెలంగాణలోనూ ఉపాధి హామీ చట్టం పేరు మార్చొద్దని తీర్మానం చేస్తారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేముళ్ల సత్యనారాయణ, కంచ రాములు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వల్లాల మల్లేష్ పాల్గొన్నారు.
చట్టాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పోరాటం
నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, ఎంపీ చామల


