బడివేళకు బస్సేది?
బస్సు సౌకర్యం లేక..
చదవాలంటే నడవాల్సిందే..
జనగామ: జిల్లాలో రోడ్డు సౌకర్యం దాదాపు అన్ని గ్రామాలకు ఉంది. బస్సు సౌకర్యం సైతం చాలా గ్రామాలకు ఉంది. అయితే ఇప్పటికీ పలు మండలాల్లోని చాలా గ్రామాలకు బడి సమయానికి బస్సులు లేకపోవడంతో విద్యార్థులు నడిచి వెళ్లడమో, ఆటోలను ఆశ్రయించడమో జరుగుతోంది. అలాగే బస్సు సౌకర్యం లేని గ్రామాల విద్యార్థులు పక్క ఊరు బడికి వెళ్లడానికి తిప్పలు పడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా ఆటోల్లో పరిమితికి మించి, ప్రమాదకరరీతిలో విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. గతంలో పలు ప్రమాదకర ఘటనలు సైతం జరిగాయి. కాగా, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి తమ తమ నియోజకవర్గాల పరిధిలో సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే, జిల్లాలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంతో పాటు తిరుగు ప్రయాణంలో బస్సు సమస్య లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
5కి.మీ. నడవాల్సిందే..
బచ్చన్నపేట: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు వచ్చే మన్‌సాన్‌పల్లి గ్రామ విద్యార్థులు లింగంపల్లి గ్రామం వరకు 5 కిలోమీటర్లు నడిచి వచ్చి బస్సు ఎక్కి వస్తున్నారు. మళ్లీ అక్కడ దిగి సాయంత్రం కూడా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు.
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మండలంలోని పలుగ్రామాల నుంచి 100 మంది విద్యార్థులు ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటారు. అయితే రాజీవ్ చౌరస్తాలో బస్సులు ఆగకుండా నేరుగా బస్టాండ్‌లో దించడంతో అక్కడి నుంచి పాఠశాలకు వరకు నడవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
రోడ్డు ఉన్నా బస్సు సౌకర్యం లేని పలు గ్రామాలు
చదువుకోవాలంటే రెండు, మూడు కి.మీ. నడవాల్సిందే
ఆటోల్లో ప్రమాదకర ప్రయాణంతో భయాందోళనలో తల్లిదండ్రులు
పాఠశాల విద్యార్థుల కోసం బస్సులు నడపాలని వేడుకోలు
లింగాలఘణపురం: బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతీ రోజు ఆటోల్లోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో చదువుకొనే నాగారం, మాణిక్యాపురం, కళ్లెం, సిరిపురం గ్రామాల విద్యార్థులు సైకిళ్లు, ఆటోల్లోనే వెళ్తున్నారు. నాగారం గ్రామం నుంచి మూడు ఆటోల్లో సుమారు 50 మందికి పైగా అదేవిధంగా సిరిపురం, కళ్లెం, మాణిక్యాపురం గ్రామాల విద్యార్థులు సుమారు మరో 50 మంది ఆటోలు, సైకిళ్లపై వెళుతున్నారు. మండల కేంద్రానికి నాగారం, కళ్లెం, మాణిక్యాపురం నుంచి బీటీ రోడ్డు ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు.
నర్మెట: మల్కపేట, బొమ్మకూర్, ఆగాపేట, ఇప్పలగడ్డ తదితర గ్రామాల విద్యార్థులు మండలకేంద్రానికి రావాల న్నా, హన్మంతాపురం వెళ్లాలన్నా ఆటోలను, ద్విచక్ర వాహనదారులను ఆశ్రయించాల్సిందే లేదంటే నడక సాగించాల్సిందే. రోడ్డుసౌకర్యాలు ఉన్నా బస్సులు లేకపోవడంతో వారికి తిప్పలు తప్పడంలేదు.
బడివేళకు బస్సేది?
బడివేళకు బస్సేది?
బడివేళకు బస్సేది?
బడివేళకు బస్సేది?


