50 ఏళ్లు రాగానే చాలామంది ఇక కష్టపడింది చాల్లే రిటైర్‌మెంట్ తీసుకుందాం అని ఆలోచిస్తుంటారు. కానీ కాథరిన్ బ్రికెన్ మాత్రం ఇందుకు భిన్నం. 50 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ను జయించడమేకాదు, కోట్లాది డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. సంకల్పం ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎంతటి కష్టాలనైనా జయించి విజయం సాధించవచ్చని నిరూపించిన కేథరీన్ స్టోరీ తెలుసుకుందాం.
లండన్‌కు చెందిన కాథరిన్ బ్రికెన్ తన ఉద్యోగాన్ని వదిలేసి, ఇంటి నుండే ఏదైనా పని చేయాలనుకుంది. మొదటి కాన్పులో కవలలు, ఆ తరువాత కొద్ది కాలానికే మరో బిడ్డ పుట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలా పిల్లలునిద్రపోయే సమయంలో కేకులు, కుకీలు తయారు చేయడం ప్రారంభించింది.2017లో 'డోలిషియస్' అనే బహుళ-మిలియన్ డాలర్ల స్నాక్ బ్రాండ్‌కు నాంది పలికింది.
వ్యాపార ఆలోచన ఎలా పుట్టింది
2008లో అమెరికా నుండి లండన్‌కు మారినప్పుడు, అక్కడ అమెరికన్ తరహా సాఫ్ట్ కుకీలు దొరకడం లేదని గమనించింది. అలాంటివే తాను తయారు చేసి విక్రయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా 2017లో50 ఏళ్ల వయసులో, 'డోలిషియస్' 'Doughlicious' అనే సంస్థను స్థాపించింది. వ్యాపారం ప్రారంభంలో ఆమె రోజుకు 20 గంటలు పని చేసేవారు. నిరంతరం పిండి కలపడం వల్ల ఆమె చేతి వేలి కీలు దెబ్బతిని, శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

బ్రెస్ట్ క్యాన్సర్
2019లో ఆమెకు స్టేజ్-1 రొమ్ము క్యాన్సర్ సోకింది. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. సర్జరీ, రేడియేషన్ తీసుకుంటూనే వ్యాపారాన్ని నడిపించింది. అంతే కాదు వ్యాపారంపై ఉన్న ధ్యాస తన బాధను మర్చిపోయేలా చేసిందని తెలిపింది.
ప్రస్తుతం ఆమె వయసు 59 ఏళ్లు. ఆమె గత ఐదేళ్లుగా క్యాన్సర్ నుండి విజయవంతంగా కోలుకుంది. అలాగే ఆమె బ్రాండ్ 'Doughlicious' ఇప్పుడు వారానికి 10 లక్షలకు పైగా కుకీలను ఉత్పత్తి చేస్తోంది. టెస్కో, హోల్ ఫుడ్స్, టార్గెట్ వంటి అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాల స్టోర్లలో ఆమె ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.
ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు
అలుపెరుగని శ్రమ, ఎన్నో సవాళ్లు
అయితే తన సక్సెస్ అంత ఈజీగా రాలేదు అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది. అటు కేటరింగ్ పనులు చేయడం, కుకీలు తయారు చేయడం, ఇటు తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రలేకుండా ఉండటం, మళ్ళీ ఉదయం 7 గంటలకు లేచి అమ్మగా బాధ్యతలు నిర్వర్తించడం తనకు ఒక సవాల్ గా ఉండేదని తెలిపారు. కానీ క్యాన్సర్ గురించి గానీ, లేదా నొప్పి గురించి గానీ ఆలోచించే సమయం లేకుండా తన సంస్థ తనకు ఎంతో మేలు చేసిందన్నారు. ఎందుకంటే తన గురించి తన వ్యాధి గురించి మథనపడటానికి అస్సలు సమయమే లేదు, తాను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయనే విషయాన్ని తన బాధ్యత గుర్తు చేసిందని అదే తన విజయానికి బాటలు వేసిందంటారు కాథరిన్ బ్రికెన్ .
ఇదీ చదవండి: రూ. లక్షకు కొని, ‘లక్’ లేదని వదిలేశారు.. షాకింగ్ ఫ్యాక్ట్స్


