సహజీవనం నుంచి వేరుపడటం నేరం కాదు!
సమ్మతితో కూడిన సంబంధం, లైంగిక నేరం వేర్వేరు
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో కూడిన సహజీవన సంబంధంలో నేరం అనే ప్రశ్నకు తావులేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సహజీవన సంబంధం నుంచి బయటకు రావడం ఎంతమాత్రం నేరం కాదని కూడా స్పష్టం చేసింది. ఇద్దరి సమ్మతితో ఏర్పడిన సంబంధాలకు, లైంగిక నేరాలకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని జస్టిస్ బి.వి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు పెళ్లి పేరుతో పిటిషనర్‌తో సహజీవనం చేశాడు. వారికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ చిన్నారికి ఏడేళ్లు. నిందితుడిని కలిసే సమయానికి పిటిషనర్ వయస్సు 18 ఏళ్లు. అప్పటికే ఆమె వితంతువు.
అయితే, నిందితుడు తనకు అప్పటికే వివాహమైన విషయాన్ని బాధితురాలి వద్ద ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాడు‘అని పిటిషనర్ న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘వారిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆమె అత్యాచారం ఆరోపణలు చేస్తోందా? ఇద్దరు మేజర్లు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధంతో తలెత్తే పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సమ్మతంతో ఏర్పడిన సంబంధం విఫలమైనప్పుడు, దానిని నేరంగా ఎలా పరిగణిస్తారు?‘అని ప్రశ్నించింది. ఇలా అడగడం బాధితురాలిని నిందించినట్లుగా అనిపించినప్పటికీ, సంబంధంలో ఉన్న ’సమ్మతి’(కన్సెంట్) స్వభావాన్ని అర్థం చేసుకోవడం న్యాయపరంగా ముఖ్యమని స్పష్టం చేసింది. పెళ్లి కాకుండానే అతనితో కలిసి ఉండాలని, బిడ్డను కనాలని ఆమె ఎందుకు నిర్ణయించుకుందని ఈ సందర్భంగా ధర్మాసనం నిలదీసింది. అయితే, బాధితురాలి పరిస్థితి పట్ల కోర్టు సానుభూతి వ్యక్తం చేసింది. బిడ్డ పోషణ కోసం ఆమె న్యాయబద్ధంగా భరణం కోసం పిటిషన్ వేయవచ్చని సూచించింది.


