
బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎలాన్ మస్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అతడు (మస్క్) అమెరికాలో వ్యాపారం చేయలేకపోతే దుకాణం మూసేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుంది అని హెచ్చరించారు.
ఒకసారి ఆయన అమెరికా ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీలను తాను చూసుకోవాలి. అమెరికా చరిత్రలోనే ఎవరూ పొందలేనంత సబ్సిడీలను మస్క్ పొందారు. అలాంటి వ్యక్తి నా ప్రభుత్వంలో DOGE (Department of Government Efficiency) చీఫ్‌గా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఒకవేళ ఆ సబ్సిడీలే వద్దనుకుంటే ఆయన తన వ్యాపారాలను బంద్ చేసుకోవచ్చు. అమెరికా వదిలి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవొచ్చు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అదే జరిగితే.. ఇంకా రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి అవసరం ఆయనకు ఉండదు. పైగా మన దేశానికి భారీగా డబ్బు ఆదా అవుతుంది. దీనిపై DOGE (Department of Government Efficiency) గట్టిగా పరిశీలన చేయాలి. ఇది పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసే అవకాశం! అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన భారీ ఖర్చుల బిల్లు(One Big, Beautiful Bill)పై ఎలాన్ మస్క్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంతోనే ఆయన డోజ్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే మస్క్ ఎంతగా విమర్శించినప్పటికీ.. ట్రంప్ మాత్రం మస్క్ మంచి స్నేహితుడనే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో..
బిల్లు గనుక ఆమోదం పొందితే ఆ మర్నాడే తాను రాజకీయ పార్టీని ప్రకటిస్తానని మస్క్ తాజాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ట్రంప్ కూడా ఇప్పుడు ఘాటుగా స్పందించడం మొదలుపెట్టారు.
ట్రంప్ రెండో దఫా అధ్యక్ష విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్రే పోషించారు. ఆ ఎన్నికల సమయంలో దాదాపు $300 మిలియన్ల విరాళాలు ఇచ్చారు. కానీ బిల్లు కారణంగా ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే మస్క్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.