జీ20: బైడెన్‌తో మీట్‌.. సునాక్‌తో ముచ్చట్లు.. ఆయనతో షేక్‌హ్యాండ్‌

PM Modi With Biden Rishi Sunak Xi Jinping At Bali G20 Summit - Sakshi

బాలి: జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అమెరికాతో భారత సంబంధాలపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ లోతైన చర్చలు జరిపారు. సమీప భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారనున్న పలు అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాల వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు పురోగతిని సమీక్షించారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంపైనా చర్చించారు.

జీ 20 సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు మంగళవారం విడిగా సమావేశమయ్యారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపైనా బైడెన్‌తో మోదీ చర్చించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘‘క్వాడ్, ఐ2యూ2 తదితర నూతన గ్రూపుల్లో భారత్, అమెరికా సన్నిహిత సంబంధాల పట్ల ఇరువురూ సంతృప్తి వెలిబుచ్చారు. ఇండో–యూఎస్‌ బంధాన్ని బలోపేతం చేసేందుకు మద్దతుగా నిలుస్తున్నందుకు బైడెన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది భారత సారథ్యంలో జరిగే 18వ జీ 20 సదస్సు సందర్భంగా కూడా ఈ సహకారం ఇలాగే కొనసాగుతుందని విశ్వాసం వెలిబుచ్చారు’’ అని వివరించింది. ఇరువురి మధ్య ప్రయోజనాత్మక చర్చలు జరిగినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. గత వారం కాంబోడియా రాజధాని నాంఫెన్‌లో ఆసియాన్‌ ఇండియా శిఖరాగ్రం సందర్భంగా భారత, అమెరికా విదేశాంగ మంత్రులు  చర్చలు జరపడం తెలిసిందే. 

జిన్‌పింగ్‌తో కరచాలనం 
జీ20 సదస్సు సందర్భంగా బాలిలో మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కరచాలనం చేసుకోవడం దేశాధినేతలతో సహా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇండోనేíషియా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన స్వాగత విందు ఇందుకు వేదికైంది. అటుగా వెళ్తున్న జిన్‌పింగ్‌ ఆగి మోదీకి షేక్‌హ్యాండిచ్చారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ కన్పించారు. అధికారిక భేటీ కూడా ఉంటుందని ప్రచారమైనా అలాంటిదేమీ జరగలేదు. భారత్, చైనా మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు పెరగడం తెలిసిందే. 2020లో గాల్వన్‌ లోయలో చైనా సైన్యం భారత సైనికులపై దొంగ దెబ్బ తీసి 20 మందికి పైగా పొట్టన పెట్టుకున్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. అప్పటినుంచీ మోదీ, జిన్‌పింగ్‌ల ముఖాముఖి జరగలేదు. సెప్టెంబర్‌లో షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ వార్షిక శిఖరాగ్రం సందర్భంగా ఇరువురూ కలుసుకున్నారు. 

సునాక్‌తో మోదీ ముచ్చట్లు 
కొంతకాలంగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గత నెలలో బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికై, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. బాలిలో జీ 20 సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించారు. సునాక్‌ పీఎం అయ్యాక వారిరువురూ భేటీ కావడం ఇదే తొలిసారి. నేతలిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారంటూ ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ, ఇతర దేశాధినేతలు, ఐఎంఎఫ్‌ చీఫ్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు తదితరులతోనూ మోదీ ముచ్చటించారు. రిషి, మాక్రాన్, విడొడొతో బుధవారం ఆయన సుదీర్ఘ చర్చలు జరపనున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top