
డోజ్‌ను ఉసిగొల్పుతా!
అదే నిన్ను కబళించేస్తుంది
‘బిగ్ బిల్లు’పై మళ్లీ వాగ్యుద్ధం
సబ్సిడీలతో భారీగా లాభపడ్డావ్
దుకాణం మూసి సొంతింటికెళ్తావ్
అమెరికా నుంచి త్వరలో ఉద్వాసన!
టెస్లా చీఫ్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
సబ్సిడీలు ఎత్తేయాలంటూ మస్క్ సవాలు
ఆయన నోట మళ్లీ ‘కొత్త పార్టీ’ పాట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. ‘బిగ్, బ్యూటిఫుల్ బిల్’తో వారి మధ్య అప్పట్లో సాగిన వాగ్యుద్ధం మరోసారి తీవ్ర రూపు దాలుస్తోంది. బిల్లును వ్యతిరేకిస్తున్న మస్క్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎవరికీ దక్కని విధంగా ఆయన సబ్సిడీలు పొందారని ఆక్షేపించారు. సబ్సిడీలే లేకపోతే రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వంటివేవీ ఉండేవి కాదన్నారు. దుకాణం మూసేసి, ఇంటికి (దక్షిణాఫ్రికా) వెళ్లాల్సి వస్తుందంటూ ఎద్దేవా చేశారు. ‘‘బిగ్ బిల్లు మన దేశ చాలా సంపదను ఆదా చేస్తుంది. బహుశా డోజ్ దీని గురించి బాగా ఆలోచించాలి. మస్క్ పొందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులను పరిశీలించాలి’’ అని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
‘‘మస్క్ నన్ను అధ్యక్షునిగా ఆమోదించడానికి చాలా ముందునుంచే ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నా. ఈ అంశం నా ప్రచారంలో ప్రధానంగా ఉంటూ వస్తోంది. ఎలక్ట్రిక్ కార్లకు నేనేమీ వ్యతిరేకం కాదు. అవి మంచివే. కానీ అంతా వాటినే వాడాలని మాత్రం ఎవరూ బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఫ్లోరిడా వెళ్లేముందు వైట్‌హౌస్ ఆవరణలో ఈ అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘మస్క్‌కు బాగా అసంతృప్తి ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలచా. ఆయన మరెంతో నష్టపోవాల్సి రావచ్చు.
ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డోజ్‌ను మస్క్‌పైకి ఉసిగొల్పాల్సి రావచ్చు. బహుశా అదే ఆయన్ను కబళించే రాకాసిగా మారవచ్చు!’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ, తనకిస్తున్న సబ్సిడీలను ఎత్తేయాలంటూ ట్రంప్‌కు సవాలు విసిరారు. ఆ తర్వాత ఈ అంశంపై మీడియాతో ట్రంప్ స్పందించారు. మస్క్‌ను అమెరికా నుంచి తిప్పి పంపించే యోచన ఉందా అని ప్రశ్నించగా ‘‘నాకు తెలియదు. దీనిపై దృష్టి సారించి చూడాలి’’ అని బదులిచ్చారు. డోజ్‌కు ఇటీవలి దాకా సారథ్యం వహించింది మస్కే కావడం విశేషం. ఆయన 1971లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. అమెరికాలో ఏళ్ల తరబడి నివసించిన అనంతరం 2002లో ఆ దేశ పౌరసత్వం పొందారు.
కొత్త పార్టీ దేశావసరం: మస్క్
బిగ్, బ్యూటిఫుల్ బిల్‌పై మస్క్ నెల రోజులుగా ట్రంప్‌తో విభేదిస్తున్నారు. తుది ఓటింగ్‌కు ముందు సోమవారం కాంగ్రెస్‌లో ట్రంప్ చర్చించిన సందర్భంగా మస్క్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాన్ని రుణ బానిసత్వపు బిల్లుగా అభివర్ణించారు. ‘‘ఈ బిల్లు వల్ల జాతీయ రుణం మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పైగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజంగా ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి బహుశా సమయం ఆసన్నమైంది’’ అని మస్క్ ఎక్స్‌లో పోస్టు చేశారు. బిల్లును విమర్శించడంతోనే ఆగలేదు.
హౌస్ ఫ్రీడమ్ కాకస్ చైర్మన్ ప్రతినిధి ఆండీ హారిస్‌తో సహా ప్రముఖ రిపబ్లికన్ చట్టసభ సభ్యులపైనా విమర్శలు గుప్పించారు. ‘చరిత్రలో అతిపెద్ద రుణ పరిమితి పెరుగుదలతో రుణ బానిసత్వ బిల్లుకు మీరు ఓటు వేసి.. మిమ్మల్ని మీరు ఫ్రీడమ్ కాకస్ అని ఎలా పిలుచుకుంటారు?’ అని మస్క్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలంటూ మొన్నటిదాకా ప్రచారం చేసి, ఇప్పడిలా దేశ చరిత్రలోనే అతిపెద్ద రుణ పెరుగుదల బిల్లుకు ఓటేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడూ సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. మస్క్ పోస్టును సోషల్ మీడియాలో ఏకంగా 2.6 కోట్ల మందికి పైగా చూడటం విశేషం. బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానంటూ ఆ తర్వాత కొద్ది గంటలకే మస్క్ మరో పోస్ట్ పెట్టారు. ‘ఈ పిచ్చి బిల్లు రిపబ్లికన్ పార్టీకి ఆత్మహత్యాసదృశమే అవుతుంది.
అది ఆమోదం పొందితే ఆ మర్నాడే ‘అమెరికా పార్టీ’ ఏర్పడుతుంది. డెమొక్రాట్–రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయం ఇప్పుడు దేశానికెంతో అవసరం. రాబోయే పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఆ పోస్టును ఏకంగా 3.2 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ‘బిగ్’ బిల్లుపై మూడు రోజులుగా సెనేట్‌లో తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. మంగళవారం ఇది ఆమోదం పొందింది. దీనితో విద్యుత్ వాహనాలకు ప్రస్తుతం అందుతున్న భారీ సబ్సిడీలు పూర్తిగా అటకెక్కుతాయి. మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్‌ఎక్స్ ప్రభుత్వం నుంచి భారీ కాంట్రాక్టులు, సబ్సిడీలు పొందుతున్న విషయం తెలిసిందే.