నిర్లక్ష్యంతో భారీ మూల్యం

Beirut Reels From Huge Blast - Sakshi

గోడౌన్‌లో వెల్డింగ్‌ పనులతో మంటలు

బీరూట్‌ : లెబనాన్‌ రాజధాని బీరూట్‌ను వణికించిన భారీ పేలుళ్లో మృతుల సంఖ్య 100కు చేరింది. ఈ ఘటనలో నాలుగువేల మందికి పైగా గాయపడ్డారు.  పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు.  భయంతో ప్రజలు వీధుల వెంట పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎరువులు, బాంబుల తయారీలో ఉపయోగించే 2750 టన్నుల అల్యూమినియం నైట్రేట్‌ను ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా ఆరేళ్లుగా పోర్టు ప్రాంతంలో నిల్వచేశారని అధ్యక్షుడు మేఖేల్‌ ఔన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్ర నిర్లక్ష్యమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

బాధ్యులపై చర్యలు

పేలుళ్లకు బాధ్యులను విడిచిపెట్టబోమని, వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ప్రధానమంత్రి హసన్‌ దియాబ్‌ హెచ్చరించారు. కాగా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైందని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచిన వేర్‌హస్‌లో వెల్డింగ్‌ పనులు చేపట్టడంతోనే పేలుళ్లు ప్రారంభమయ్యాయని భద్రతాధికారులతో పాటు మీడియా పేర్కొంది.  మరోవైపు దశాబ్ధాల తరబడి సాగిన అవినీతి, పాలనా వైఫల్యాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని లెబనాన్‌ ప్రజలు రాజకీయపార్టీలపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీరూట్‌ పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన మేయర్‌ జమాల్‌ ఇతాని ఈ ప్రాంతం వార్‌ జోన్‌ను తలపిస్తోందని..తనకు మాటలు రావడం లేదని అన్నారు.పేలుళ్ల బీభత్సంతో కోట్లాది డాలర్ల నష్టం వాటిల్లిందని బీరూట్‌, లెబనాన్‌లకు ఇది కోలుకోలేని దెబ్బని వ్యాఖ్యానించారు.

ఇక ఈ ఘటనలో వంద మంది మరణించారని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లెబనాన్‌ రెడ్‌క్రాస్‌ హెడ్‌ జార్జ్‌ కెట్టాని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ పేలుళ్లలో మృతుల్లో అత్యధికులు పోర్ట్‌, కస్టమ్స్‌ ఉద్యోగులే ఉన్నారు.సెంట్రల్‌ బీరూట్‌లో భవనాలు దెబ్బతినగా, ఫర్నీచర్‌ వీధుల్లో పడిపోయింది. వీధులన్నీ గ్లాసు ముక్కలు శిధిలాలతో నిండాయి. పోర్టుకు సమీపంలోని కార్లు పల్టీలు కొట్టాయని స్ధానికులు పేలుళ్ల బీభత్సాన్ని గుర్తుచేసుకున్నారు. తాము ఇప్పుడు విపత్తు ప్రాంతంలో ఉన్నామని, పేలుళ్ల ధాటికి తన భవనం కదిలిందని డౌన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన బిలాల్‌ (60) చెప్పుకొచ్చారు. పేలుళ్ల ప్రభావం చూసి తాను భూకంపం అనుకున్నానని ఆయన పేర్కొన్నారు. చదవండి : బీరూట్ పేలుళ్లు: వైర‌ల్ వీడియోలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top