కళ్లకు గంతలు కట్టుకుని పీఏసీఎస్‌ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

కళ్లకు గంతలు కట్టుకుని పీఏసీఎస్‌ ఉద్యోగుల నిరసన

Feb 13 2026 3:39 AM | Updated on Feb 13 2026 3:39 AM

కళ్లకు గంతలు కట్టుకుని పీఏసీఎస్‌ ఉద్యోగుల నిరసన

కళ్లకు గంతలు కట్టుకుని పీఏసీఎస్‌ ఉద్యోగుల నిరసన

కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులు గురువారం శ్యామలానగర్‌లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 70 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు కనబడటం లేదంటూ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణమే సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల జిల్లాలకు చెందిన పీఏసీఎస్‌ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఏసీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మువ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెండు నెలలకు పైగా పీఏసీఎస్‌ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. శుక్రవారం(నేడు) రాష్ట్రంలోని అన్ని జిల్లాల పీఏసీఎస్‌ ఉద్యోగులతో కలిసి సహకార శాఖ కమిషనర్‌, రిజిస్ట్రార్‌ కార్యాలయాల ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఈ నెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు మువ్వా వెంకటేశ్వరరావు, టి.వెంకటరామయ్య, కె.సత్యనారాయణ, పి.రామునాయుడు, కృష్ణమోహన్‌, వీరభద్రుడు, రెడ్డి సత్యారావు విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల జిల్లాల పీఏసీఎస్‌ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

నేడు సహకార శాఖ కమిషనర్‌

కార్యాలయం ముట్టడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement