రేపు మిర్చి యార్డు కార్మికుల సమ్మె
కొరిటెపాడు(గుంటూరు): ఈ నెల 12వ తేదీన జాతీయ సమ్మెలో భాగంగా మిర్చి యార్డులోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు నాయకులు తెలిపారు. దీనిలో భాగంగానే మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి చంద్రికకు మంగళవారం అన్ని సంఘాలు కలిపి సమ్మె నోటీస్ అందజేశాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ ‘కార్మిక కోడ్‘ల పేరుతో ఇప్పటివరకు ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నియంత్రణలో ఉండే వ్యవసాయం, మార్కెటింగ్ వ్యవస్థ స్థానంలో ప్రైవేట్ మార్కెటింగ్‌కు అవకాశం కల్పిస్తూ చట్టాలు మారుస్తున్నారని, దీంతో ప్రస్తుత మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న రైతులు, కార్మికులు, ఉద్యోగులకు చివరకు చిన్న వ్యాపారస్తులకు కూడా నష్టమేనని తెలిపారు. పై సమస్యల పరిష్కారానికై గురువారం మిర్చి యార్డులో పనిచేసే అన్ని రకాల ముఠా కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో భాగస్వాములు అవుతున్నట్లు తెలిపారు. 12వ తేదీన సమ్మె కారణంగా ఎలాంటి లావాదేవీలు జరగవు కాబట్టి రైతులు ఎవరూ మిర్చి బస్తాలు తీసుకురావద్దని తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో మిర్చి యార్డు ఎగుమతి, దిగుమతి, కాపలా ముఠా కార్మిక సంఘాల నాయకులు మర్రి శ్రీనివాస్, నాగ గౌడ్, వేమెన్స్ అసోసియేషన్ నాయకులు బాబు, కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోవిందరావు తదితరులున్నారు.


