సరిగ్గా ఏడాది క్రితం 2025 ఏప్రిల్ 22న పహల్‌గామ్‌లోని బైసరన్ లోయ ఎప్పటిలాగే పర్యాటకులతో సందడిగా ఉంది. ఇంతలో హఠాత్తుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. ఒక స్థానికునితో పాటు 26 మంది అమాయకులు బలైపోయారు. దేశం మొత్తం ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైంది.
మొదలైన వేట
దాడి చేసిన వారిని గుర్తించడం భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మారింది. మొదట్లో వారి గురించి ఎటువంటి సమా చారం లేదు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు కలిసి క్షేత్రస్థాయిలో నిఘా పెంచాయి. ఫలితంగా దాడి జరిగిన కొన్ని రోజులకే దక్షిణ కశ్మీర్ ప్రాంతం నుండి కొన్ని సాంకేతిక సంకేతాలు (టెక్నికల్ సిగ్నేచర్స్) అందాయి. దీంతో హాపత్నార్ ఎగువప్రాంతాల్లో భారీ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉగ్రవాదులు అక్కడ దొరకలేదు కానీ వారు అక్కడి నుండి తరలిపోతున్నట్లు ఆధారాలు లభించాయి.
జూన్ నెల మధ్యనాటికి ఉగ్రవాదులు తమ వ్యూహాన్ని మార్చు కున్నారు. పట్టణ ప్రాంతాల నుండి దూరంగా, దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయారు. ఇది భద్రతా దళాలకు పరీక్షగా నిలిచింది. జనసంచారం ఉన్న చోట సమాచారం సులభంగా లభిస్తుంది, కానీ అడవుల్లో కదలికలను గుర్తించడం కష్టం కదా! అయినా మన దళాలు పట్టు విడవకుండా దాచీగామ్ అడవులు, దక్షిణ కశ్మీర్ అడవులను కలిపే ఎగువ ప్రాంతాల్లో తాత్కాలిక సైనిక స్థావరాలను (టీఓబీలు) ఏర్పాటు చేసుకుని అన్వేషణ కొనసాగించాయి.
క్రమంగా అడవు లను తమ అధీనంలోకి తీసుకోసాగాయి. జూలై రెండో వారంలో ఈ కష్టానికి ఫలితం కనిపించింది. దాచీగామ్ బెల్ట్ ప్రాంతంలో ఉగ్ర వాదుల టెక్నికల్ సంకేతాలను మళ్ళీ గుర్తించగలిగారు. అంతే... కేంద్ర నిఘా సంస్థల సమన్వయంతో ఆ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేశారు. దట్టమైన అడవి కావడం వల్ల గాలింపు కష్టమని గుర్తించిన అధికారులు... ఆ ప్రాంతాన్ని విభిన్న సెక్టార్లుగా విభజించారు. ప్రతి సెక్టార్‌కు ఒక బృందాన్ని కేటాయించారు. ఈ బృందాలు రోజుల తరబడి అడవుల్లో తిరుగాడాయి.
ఆపరేషన్ మహాదేవ్
చివరికి జూలై 28న శ్రీనగర్ కొండల్లో సైన్యానికి చెందిన స్పెషల్ ఫోర్స్ యూనిట్‌కు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరి గాయి. ఇదే ‘ఆపరేషన్ మహాదేవ్’. ఈ మెరుపు దాడిలో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. వీళ్లను ఫైజల్ జట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీ లుగా గుర్తించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు.
వీళ్లు ‘లష్కరే తోయిబా’ దాని అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’కు చెందిన వాళ్లని తేల్చారు. చనిపోయినవారు పహల్‌గామ్ దాడికి పాల్పడినవారేనని నిరూపించడానికి భద్రతా దళాల దగ్గర గట్టి ఆధారాలే ఉన్నాయి. పహల్‌గామ్‌లో దొరికిన బుల్లెట్ సెల్స్, దాచీగామ్‌లో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఒకే రకమైనవని బాలిస్టిక్ విశ్లేషణలో తేలింది. దాడి జరిగిన రోజు నమోదైన టెక్నికల్ సిగ్నే చర్స్, ఆపరేషన్ మహాదేవ్ సమయంలో దొరికిన సిగ్నేచర్స్‌తో సరి పోలాయి. ఆ ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన ఒక గుజ్జర్ కుటుంబం కూడా వారిని గుర్తించింది.
ఆపరేషన్ సిందూర్
పహల్‌గామ్ దాడి జరిగిన వెంటనే భారత ప్రభుత్వం ఉగ్ర వాదుల కోసం తన భూభాగంలో వేటసాగిస్తూనే... సరిహద్దుల ఆవల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. 2025 మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌లో పాక్ ఆక్ర మిత కశ్మీర్, పాకిస్తాన్‌లో ఉన్న తొమ్మిది ప్రధాన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పహల్ గామ్‌లోని లిడ్డర్ నది ఒడ్డున ఒక స్మారక కట్టడాన్ని నిర్మించారు. నల్లటి చలువరాతి స్మారక ఫలకంపై మరణించిన 26 మంది పేర్లను చెక్కారు. 93 రోజుల పాటు సాగిన ఆపరేషన్ మహాదేవ్ అందించిన స్ఫూర్తి కశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణకు నాంది పలికింది. ఏడాది క్రితం అమాయకుల రోదనలు, గుండెల్ని పిండే వేదనలకు సాక్షీ భూతంగా నిలిచిన లిడ్డర్ నది తన పర్యాటక దేవుళ్ల పాదాలు చల్లగా స్పృశిస్తూ అలా ముందుకు సాగిపోతోంది ఈ నేల బిడ్డల ఆశలను చిగురింపజేస్తూ!
-ఎడిటోరియల్ టీమ్


