పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా? | Mumbai Watermelon Incident: Experts Warn of Real Danger | Sakshi
Sakshi News home page

పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?

Apr 28 2026 1:05 PM | Updated on Apr 28 2026 1:34 PM

Mumbai Watermelon Incident: Experts Warn of Real Danger

ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న వార్త కొత్త ఆందోళనలకు దారి తీసింది. సీజన్‌తో సంబంధం లేకుండా చాలామందికి బిర్యానీ ఫేవరెట్‌ ఫుడ్‌. అలాగే వేసవిలో ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. అలాంటివి ప్రాణాలు తీసేంత ప్రమాదకరమా? అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు ఆ అపోహలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ముంబైలో జరిగిందేంటి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు శనివారం రాత్రి 10.30గం. ప్రాంతంలో మొదట బిర్యానీ తిన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న పుచ్చకాయ (వాటర్‌మెలన్)ను తిన్నారు. కొన్ని గంటల్లోనే వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతూ 12 గంటల వ్యవధిలోనే ఆ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.

ట్రీట్‌మెంట్‌ సమయంలో ఆ నలుగురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఇది ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగిందనడానికి నిదర్శనమని వైద్యులు ప్రకటించారు. పోలీసులు మాత్రం దీన్నొక యాక్సిడెంటల్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్లు తినగా మిగిలిన బిర్యానీ, పుచ్చకాయ ముక్కలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. పోస్ట్‌మార్టం.. హిస్టోపాథాలజీ రిపోర్టులు వచ్చాకే వాళ్లు ఎలా చనిపోయారన్న దానిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈలోపే.. 

బిర్యానీ తిన్న మిగతా బంధువులు బాగానే ఉండడంతో.. పుచ్చకాయనే ఈ మరణాలకు కారణమై ఉంటుందనే చర్చ(సోషల్‌ మీడియా రచ్చ) మొదలైంది. నిపుణులు చెబుతోంది ఏంటంటే.. పుచ్చకాయకు త్వరగా కలుషితమయ్యే గుణం ఉంటుందని. 

పుచ్చకాయ వేసవిలో తినడానికి అత్యంత ఆరోగ్యకరమైన పండు. ఇది 90% పైగా నీటితో నిండి ఉండి శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, విటమిన్ A, C, లైకోపిన్, పొటాషియం వంటి పోషకాలు అందిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మం, కళ్లకు మేలు చేస్తుందని డైటీషియన్‌ డాక్టర్‌ అర్చనా బాత్రా అంటున్నారు. అయితే ముంబై కేసుపై ఆమె స్పందిస్తూ.. పుచ్చకాయలో సాల్మొనెల్లా, లిస్టీరియా, ఎస్టరేషియా కొలై లాంటి హానికరమైన పాథోజెన్లు చేరితే కలుషితం అవుతుందని.. అప్పుడు అది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుందని చెబుతున్నారు. ‘‘ఈ ప్రభావంతో తిన్న వ్యక్తులు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇన్ఫెక్షన్‌ సోకి అవయవాలపై ప్రభావం చూపవచ్చు. ట్రీట్‌మెంట్‌ ఆలస్యమైతే ప్రాణాల మీదకు రావొచ్చు’’ అని ఆమె అంటున్నారు. 

పుచ్చకాయలో అధిక నీరు, సహజ చక్కెర ఉండడం కూడా బ్యాక్టీరియా వేగంగా పెరగడానికి కారణమని ప్రముఖ న్యూట్రీషనిస్ట్‌ రుపాలి దత్తా అంటున్నారు. కొన్నిసార్లు పుచ్చకాయల్లో తీపి పెంచడానికి గ్లూకోజ్ నీరు లేదంటే చక్కెర నీరు ఇంజెక్ట్ చేస్తారని.. ఆ సమయంలోనూ కలుషితం కావొచ్చని.. అలాంటివి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు.

అలాగని పుచ్చకాయ ప్రాణం తీస్తుందని కాదు. పండ్లు కలుషితం కావడం, సరిగా నిల్వ చేయకపోవడంతో కచ్చితంగా ప్రమాదకరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

  • పుచ్చకాయను కొనేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి 

  • తొక్కతో సహా బాగా కడగాలి.. చాలా మంది ఈ జాగ్రత్త పాటించరు

  • పుచ్చకాయను కోయడానికి శుభ్రమైన కత్తులు, బోర్డులు వాడాలి.

  • కట్ చేసిన పుచ్చకాయ గది ఉష్ణోగ్రత వద్ద త్వరగా చెడిపోతుంది 

  • పుచ్చకాయను కట్‌ చేశాక 2 గంటలకు మించి బయట ఉంచకూడదు

  • కట్‌ చేసి ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయను తింటే ప్రమాదమేం కాదని న్యూట్రీషనిస్ట్ రుపాలి దత్తా చెబుతున్నారు

  • అయితే ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ చేస్తే రుచి, పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి కట్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయను రెండు, మూడు రోజులకు మించి ఉంచకూడదని ఆమె సూచిస్తున్నారు.. 

సరైన పుచ్చకాయను ఎంచుకోవడం ఎలా..?

1.తొక్క రంగు చూసుకోవాలి

  • గాఢమైన ఆకుపచ్చ రంగులో ఉండి, గీతలు స్పష్టంగా కనిపిస్తే అది పండిన పుచ్చకాయ.
  • చాలా మెరిసే తొక్క ఉంటే ఇంకా పండలేదని అర్థం.

2. ఫీల్డ్ స్పాట్ (పసుపు మచ్చ) చూడాలి

  • నేలపై పెరిగిన చోట పసుపు లేదంటే క్రీమ్ రంగు మచ్చ ఉంటుంది. అది గాఢంగా ఉంటే పుచ్చకాయ బాగా పండింది.
  • తెల్లగా లేదంటే లేతగా ఉంటే ఇంకా పండలేదు.

3. తట్టి చూడాలి

  • పుచ్చకాయను తట్టి చూసినప్పుడు లోపల ఖాళీగా ఉన్నట్టుగా “తక్కువ శబ్దం” వస్తే అది పండింది.
  • ఎక్కువగా ఘనంగా శబ్దం వస్తే ఇంకా పండలేదని అర్థం.

4. బరువు చూసుకోవాలి

పరిమాణానికి తగినంత బరువుగా ఉంటే అది రసంతో నిండిన పుచ్చకాయ.

తేలికగా ఉంటే లోపల నీరు తక్కువగా ఉంటుంది.

5. ఆకారం గమనించాలి

  • గుండ్రంగా, సమంగా ఉన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయి.
  • పొడవుగా లేదంటే అసమంగా ఉన్నవి తక్కువ తీపి కలిగి ఉండే అవకాశం ఉంది.

పుచ్చకాయ మాత్రమే కాదు.. రాత్రి ఆలస్యంగా ఏ పండ్లు తినడం జీర్ణక్రియను కష్టతరం చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదంటే మధ్యాహ్నా సమయంలోనే పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement