'అనాగరికుడు'! గేటుతీసుకుని లోపలికొచ్చి.. | Barbarian 'Anagarikudu' Sunday Funday Entertainment And Long Story | Sakshi
Sakshi News home page

'అనాగరికుడు'! గేటుతీసుకుని లోపలికొచ్చి..

Published Sun, Jun 16 2024 9:52 AM | Last Updated on Sun, Jun 16 2024 9:52 AM

Barbarian 'Anagarikudu' Sunday Funday Entertainment And Long Story

గేటుతీసుకుని లోపలికొచ్చి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పీరయ్య. మాసిన గళ్లచొక్కా, నలిగిన ప్యాంటు, చెదిరిన జుట్టు, పెరిగిన గడ్డం, లోతుకుపోయిన ఎర్రటి కళ్లు, వొంగిన కడ్డీలాంటి గరుకు శరీరం. జైలు నుంచి విడుదలైన సంవత్సరకాలంలో ఇంకా సన్నబడ్డాడు. ఈమధ్య అంతగా రావడంలేదు.
‘మనవూర్లోనే వుంటున్నావా?’ అడిగాను న్యూస్‌ పేపరు పక్కనపెట్టి.
      ‘వొకవూరని లేదు వాసుబాబూ’ ఉదయపుటెండలో పూల మీద ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తూ అన్నాడు. 
‘యెందుకని?’

‘యేడేండ్లలో కాలం మారలేదా? నేను యిడుదలైవొచ్చే లోపల రాజకీయాలూ మారిపోయినాయి. మా పెదలింగయ్య, ఆయన దాయాదీ రాజీపడి ఫ్యాక్చన్‌ వైరాలు నిలిపేసిరి. వాల్ల పిల్లోళ్లు డాకటర్లు, యింజనీర్లై సిటీలకు, యిదేసాలకు యెళ్లిపోయిరి. యింగ మందీమార్బలంతో, జీపులతో, నా మాదిరి డ్రైవర్లతో పనేముండాది? పెదలింగయ్య బెంగుళూరులో కొడుకు దెగ్గిరికి యెళ్లిపోయినాడు’

మార్పువచ్చి ఉపాధి పోయినందుకు అతనిలో నిరాశ కనిపించలేదు. పోరాట వాతావరణంలో ఉండేవాళ్లు ఎలాంటి నష్టానికైనా సిద్ధంగా ఉంటారేమో అనుకున్నా. ‘డ్రైవరు పని లేకపోతే సేద్యం చేసుకోవచ్చు. నీక్కొంచెం చేనుండాలిగదా?’ అన్నా.
      ‘నేను జైలుకుబోయి, మాయమ్మ కాలమైపోయినాక సేనంతా కంపసెట్లు మొల్చి నా మాదిరే తరంగాకుండా ఐపోయిండాది’ 
‘బాగుచేసుకోలేకపోయినావా?’ 
     ‘వూళ్లో వుండలేక పోయినాను. ఫ్యాక్చన్లో యెదుటోణ్ణి సంపితే వోడు యీరుడు. పెండ్లాన్ని సంపిన కేసు మీద యేడేండ్లు జైలుకు పోయొచ్చినోడికి మర్యాదేముంటాది?’ 
పీరయ్య తన భార్య సంగతి మాట్లాడినప్పుడు గొంతు జీరగా పలుకుతుంది. అందులో దుఖంతోపాటు తను నిర్దోషిననే భావన ఉంటుంది. 
      ‘నువ్వాపని చెయ్యలేదని, అది ప్రమాదం వల్ల జరిగిందని వూళ్లో నమ్మడంలేదా?’
‘యెవురు నమ్మినారో యెవురు లేదో. అందురూ నీమాదిరుంటారా? తల్లీ, బార్యా యిద్దురూ పోయినారు. కోర్టు సెప్పిన సిచ్చ ఐపోయినా ప్రెపంచం యేసిన సిచ్చ యింగా నడస్తావుంది. పెదలింగయ్య నీడ గూడా పాయె. జెనం సైలెంటుగా వుండేదానికి నేనేమన్నా డబ్బు, పలుకుబడీవుండే బడాబాబునా? నా గురించి సెప్పినాక యాడా కుదురుగా పని యియ్యడంలేదు, ఆడా యీడా తిరగతావుండా’ ఉదాసీనంగా అన్నాడు.

‘తను తప్పు చెయ్యలేదనే భావన ఒక్కటే పీరయ్య జీవితేచ్ఛేను కొనసాగిస్తున్నట్టుంది’ అనుకున్నా.
నా శ్రీమతి తెచ్చిపెట్టిన ఉప్మాతిని, కాఫీతాగి ‘సిటీలో నాకేదైనా డ్రైవరుద్యోగం సూపించు వాసుబాబూ. నీలాంటి మంచోడు సెప్తే యిస్తారు’ అని వెళ్లిపోయాడు.
       పీరయ్య గురించిన ఆలోచనల్లో పడ్డాను.
ఆర్థిక నేపథ్యాలు వేరైనా పీరయ్యా నేనూ చిన్నతనంలో స్నేహితులం. తండ్రి అనారోగ్యంతో చనిపోయాక పీరయ్య చదువును ఐదోతరగతిలోనే ఆపేసి తల్లి అంకమ్మతో పొలం పనులకు, యెనుములను మేపడానికి వెళ్లేవాడు. పీరయ్యకు మొదట్నుంచి డ్రైవింగ్‌ అంటే మోజు. అతనికి పన్నెండేళ్లప్పుడే ఊరి దగ్గర కడుతున్న పెద్దచెరువు పనికోసం వచ్చే టిప్పర్లు, జీపులకు క్లీనరుగా వెళ్తూండేవాడు. పెద్దయ్యాక డ్రైవింగ్‌ నేర్చుకుని మా పక్కవూర్లోని ఫ్యాక్షన్‌ లీడర్‌ పెదలింగయ్య దగ్గర జీపుడ్రైవరుగా స్థిరపడ్డాడు.

మా కుటుంబం ఊరొదిలేశాక పీరయ్యను కలవడం తగ్గిపోయింది. ఎప్పుడైనా కలసినప్పుడు తన సాహసంతో, డ్రైవింగ్‌ ప్రతిభతో పెదలింగయ్యను ప్రత్యర్థుల నుంచి ఎలా రక్షించాడో ఉద్వేగంగా చెప్పేవాడు. పోరాటంలో హింస తప్పుకాదని, ఐతే అది న్యాయం కోసం అయివుండాలి అనేవాడు. నమ్మినవాళ్ల కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలనేవాడు. పైకి అనాగరికంగా, నిర్లక్ష్యంగా, రఫ్‌గా కనపడ్డం, ఫ్యాక్షనిస్టు నాయకుడితో ఉండడంవల్ల లోకం అతన్ని ఒక రౌడీగానే చూసేది. పీరయ్యకూడా తన వృత్తికి ఆ ఇమేజ్‌ అవసరమని భావించి దాన్నే బహుముఖంగా ప్రదర్శించేవాడు.

పీరయ్యకు పెదలింగయ్య పొలాలు చూసే ఓబయ్య కూతురు గౌరితో పెళ్లైంది. గౌరి చక్కగా వుంటుంది. ‘తండ్రికి ఇష్టంలేకపోయినా, తను మోటుగా వున్నా జానపద కథల్లోలా తన నైపుణ్యం, తెగువ చూసి గౌరే పట్టుబట్టి పెళ్లిచేసుకుందని’ నమ్మాడు పీరయ్య. అదే బయట గర్వంగా చెప్పుకుని వ్యతిరేకులను పెంచుకున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవాళ్లు. ఐతే గౌరికి ముక్కు మీద కోపమని, తన తల్లి అంకమ్మతో పడదని వాపోయేవాడు. క్రమంగా అత్తాకోడళ్లకు తగవులు పెరిగిపోయాయి. తగవులైనప్పుడు పీరయ్య నలుగురి ముందు భార్య మీదే కేకలేసి పైకి తన ఆధిక్యతను ప్రదర్శించేవాడు. ఒక్కోరోజు విసుగెత్తి ఇంటికి రాకుండా పెదలింగయ్య బంగళా దగ్గరే ఉండిపోయేవాడు.

పెళ్లైన కొన్నేళ్ల తరువాత ఒక తుఫాను రాత్రి పీరయ్య జీవితంలోనే తుఫాను తెచ్చింది. పెద్దవర్షంలో అతను ఆలస్యంగా ఇంటికొచ్చేసరికి కోడలితో పోట్లాట జరిగి అంకమ్మ యెనుముల కొట్టంలో తడుస్తూ చలికి ముడుచుకుపోయి ఏడుస్తూ కనపడింది. పీరయ్య ఆవేశంగా ఇంట్లోకెళ్లి ఒక్కతేవున్న గౌరితో గొడవ పడ్డాడు. పెనుగులాటలో గోడకున్న పెద్దమేకు తలవెనక దిగి, రక్తంకారి గౌరి స్పృహ తప్పి పడిపోయింది.

పీరయ్య జీపులో ఆమెను దగ్గర్లోని చిన్నాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టరు సెలవులో ఉండడంతో ఆ వర్షంలో, కిందామీదా పడి పొంగుతున్న వాగులుదాటి, ఆలస్యంగా టౌనుకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స జరిగింది గాని గౌరి స్పృహలోకి రాలేదు. రెండురోజుల తరువాత చనిపోయింది. పీరయ్య డ్రైవింగ్‌ నైపుణ్యం తుఫాను చేతిలో ఓడిపోయింది. పీరయ్య షాక్‌ కి గురై కొన్నాళ్లపాటు అచేతనంగా ఉండిపోయాడు.

అల్లుడే తనకూతుర్ని హత్య చేశాడని ఓబయ్య కేసు పెట్టాడు. పీరయ్య వ్యతిరేకులే అతన్నలా ఎగదోశారని కొందరన్నారు. ఓబయ్య కూడా తన మనిషే కాబట్టి పెదలింగయ్య తటస్థంగా ఉండిపోయాడు. పీరయ్య సానుభూతిపరుల సాయం సరిపోలేదు. కేసు రెండేళ్లు నడిచాక పీరయ్యకు రిమాండుతో కలిపి ఎనిమిదేళ్లు శిక్షపడింది.

పీరయ్యను జైల్లో కలిసినప్పుడు ‘మంట ఆరిన కాగడాలా’ కనిపించేవాడు. ‘నేను ఫ్యాక్చన్‌ మనిసిగా వుండడం, రౌడీగా ఔపడ్డం, గౌరితో మనువాసించి బంగపడిన యెదవలు మాపెదలింగయ్య మనుసు యిరిసేయడమే గాక నాకు యెతిరేక సాచ్చమివ్వడం వల్ల సెయ్యని నేరానికి సిచ్చపడింది’ అని వాపోయేవాడు. ‘ఆడికీ ‘కోర్టు సానుభూతిగా సూసి తక్కవలో పోగొట్టిందని’ మా వకీలుసారు సెప్పినాడు’ అని సమాధానపడేవాడు. మళ్లీ అంతలోనే ‘ఐనా నేను గౌరిని సంపడమేంది, నాకీ సిచ్చేంది వాసుబాబూ’ అని ఏడ్చేవాడు.

‘ఆరాత్రి ఏం జరిగిందో ఇంకెవరూ చూడలేదు. పీరయ్యకు హింసాప్రవృత్తి లేదని అనుకునే నాలాంటి వాళ్లు కొందరు తప్ప మిగతావాళ్లెవరూ అతని మాటలు నమ్మినట్టు కనపడదు. దానికి చాలావరకూ కారణం అతనే. పీరయ్య ఏ ధర్మాన్ని నమ్ముకున్నాడో అదే అతన్ని దెబ్బతీసింది’ అనుకున్నా.

‘గౌరి ప్రెమాదం వల్లే సచ్చిపోయిందని లోకం యేపొద్దుటికైనా తెల్సుకుంటాది. ఐనా గౌరి ఆత్మకు నిజెం తెల్సు, అదేసాలు’ అని శిక్ష చివరి రోజుల్లో గాలిలోకి చూస్తూ అనేవాడు.
      జైలు జీవితంలో పీరయ్య చూడ్డానికి మరింత గరుకు తేలినా, మొహంలో మునుపటి రౌడీ కవళికలు పోయాయి. మంచి ప్రవర్తన కారణంగా సంవత్సరం ముందే విడుదలయ్యాడు.
‘మీ ఆఫీసుకు టైమౌతోంది’ అన్న శ్రీమతి పిలుపుతో వర్తమానంలోకి వచ్చాను.

నెలరోజుల తరువాత ఒక సాయంత్రం నేను డాబా మీద కుండీల్లో మొక్కలకు నీళ్లు పోస్తూంటే వచ్చాడు పీరయ్య. మంచి ప్యాంటు షర్టు వేసుకున్నాడు, తల దువ్వుకుని, తేట మొహంతో నీట్‌గా ఉన్నాడు. సూర్యుడు దిగిపోయాడు, గుళ్లోని సుబ్బులక్ష్మి పాటకి చెట్లు తలలూపుతున్నాయి, జమ్మిచెట్టు మీది పక్షులు ముందే గూళ్లు చేరుకుంటున్నాయి. 
‘మీ కాలనీలో దేవరాజుసారు దెగ్గిర డ్రైవరుద్యోగం దొరికింది. రెండురోజులాయె. మకాం యింటెనకాల అవుటౌసులోనే’ గట్టు మీద కూర్చుంటూ చెప్పాడు.

      ‘మా కాలనీ ప్రెసిడెంటు దేవరాజుగారు నీకు తెలుసా?’ అడిగాను ఆశ్చర్యపోయి. 
‘మా పెదలింగయ్య కొమారుడు నితీషుబాబూ యీయనా వొకే కాలేజీలో సదూకున్నారంట. ఆయన సిఫార్సు సేసినారు’
      ‘దేవరాజుగార్తో నాకంత పరిచయంలేదు గాని ఆయన్నందరూ పెద్దమనిషిగా గౌరవిస్తారు. గుడి ధర్మకర్త కూడా ఆయనే. బాగా డబ్బు, పలుకుబడి వున్నా మృదువుగా మాట్లాడతారు, అన్నదానం లాంటి కార్యాలకు వుదారంగా సాయం చేస్తారు. యెత్తుగా, తెల్లగా, చక్కగా వుంటారు’
      ‘ఆయన్ని సూస్తే అట్లాగే అనిపిస్తాది. యెందుకైనా మంచిదని మా నితీషుబాబు దేవరాజుసారుకి నా సంగతంతా సెప్పినాడు. అంతా యిన్నాక గూడా నన్ను డ్రైవరుగా తీసుకున్నాడంటే ఆయన శానా మంచోడనేగదా! అంతేగాదు, నన్ను ఆయన భార్య అనసూయమ్మగారి కారు తోలమన్నాడు, దర్మాత్ముడు. ఆయమ్మది సామనసాయ. ఆయనంత సక్కగా వుండదు. కానీ దయాగునంలో మహాతల్లి’ చేతులు జోడించి కళ్లు సగం మూశాడు పీరయ్య.

‘ఆయనకు తగ్గ యిల్లాలని చెప్తారు. కాని ఆమెకు యీమధ్య ఆరోగ్యం అంత బావుండడం లేదని, మనిషి కూడా చిక్కిపోయిందనీ విన్నాను. దాన్ని గురించి ఆయన తిరగని ఆసుపత్రి, వెళ్లని గుడీ లేదంటారు’ గుడిగంట పెద్దగా మోగింది. పక్షులు కలకలంగా లేచి మళ్లీ చెట్లల్లో సర్దుకున్నాయి.
      ‘ఆయిల్లెట్లుంది బాబూ? యింద్రబొవనమే! యిల్లంతా పాలరాయి, టేకు వొస్తువులే, గోడలకు పేద్ద పటాలు, మూలల్లో సెందనం బొమ్మలు, కనపడని లైట్లు! దీనిముందు మా పెదలింగయ్య బంగళా పాతబడిన మహలే’ 
      ‘మా కాలనీలో వుండాల్సిన యిల్లు కాదంటారు. నీ తిండితిప్పల సంగతేమిటి?’  
‘ఆయమ్మ పనోళ్లనట్లా వొదిలేస్తాదా బాబూ? మూడుపూట్లా తిండి ఆణ్ణే. మాయమ్మగూడా నన్నట్లా సూడలేదు’ తృప్తిగా చెప్పాడు, 
      ‘మరింకేం, వుద్యోగం జాగ్రత్తగా చేసుకో’ 
‘సరేగాని బాబూ, పెండ్లాన్ని సంపిన కేసులో నేను యేడేండ్లు జైలుకు బోయి వొచ్చినా యీసారు నాకెట్లా వుద్యోగమిచ్చినాడు?’ అడిగాడు పీరయ్య.

‘కాలం మారింది పీరయ్యా, యిప్పుడు పనిలో నైపుణ్యం, విధేయత ఇవే చూస్తారు. అవి నీ దగ్గరున్నాయి. వుద్యోగమిచ్చేవాళ్లకి అంతకుమించి అక్కర్లేదు. నీకవి వున్నన్నాళ్లూ నీ వుద్యోగం నిలుస్తుంది’ అన్నా. అర్థం అయ్యీ కానట్టుగా తలవూపి ‘ఖాలీ దొరికినప్పుడు వొస్తా’ అంటూ వెళ్లిపోయాడు.

‘హఠాత్తుగా తనకు పూర్తిగా కొతై ్తన నాగరిక ప్రపంచంలో పడ్డాడు పీరయ్య, యెలా నెట్టుకొస్తాడో’ అనుకున్నా. ఒక ఉదయం నేను బస్టాపులో వెయిట్‌ చేస్తుంటే పీరయ్య కారాపి ‘యెక్కుబాబూ అఫీసుదెగ్గిర దింపతా’ అని బలవంతం చేసి వెనకసీట్లో ఎక్కించాడు. దారిలో ఒక హోటల్‌ దగ్గర చెట్టుకింద ఆపి ‘టీ తాగుదాం బాబూ, తలనొప్పిగా ఉండాది’ అని రెండు పేపరు కప్పుల్తో టీ పట్టుకొచ్చాడు. 

‘యెలావుంది వుద్యోగం’ అడిగాను టీ తాగుతూ. 
      ‘బాగుంది బాబూ. జీతమంతా మిగులే. వూర్లో సేను బాగసేయించి మా సిన్నాయన కొడుకును దున్నుకోమని సెప్పినా. నేనింగ ఆవూర్లో వుండలేను గాబట్టి యిల్లుగూడా రిపేరు జేయించి బాడుక్కిచ్చేసినా’ అన్నాడు. 
‘వొక గాడిలో పడినట్టే’
      టీ తాగాక పీరయ్య గొంతు తగ్గించి ‘దేవరాజుసారు ఆస్తి, యాపారాలు మొత్తం అమ్మగారివేనంట బాబూ. యీ అయ్యగారు కాలేజీలో ఆమె యెంటబడి ప్రేమించి ఆమె నాయనకు యిష్టం లేకపొయ్యినా పెండ్లి సేసుకున్నాడంట’ అన్నాడు.
      ‘అవన్నీ నీకెందుకు?’ అన్నా, ‘గాసిప్‌ లేకపోతే మనుషులు ఎలా వుండేవారో’ అనుకుంటూ. 
‘నాకేమీ కుశాల లేదు, ఆయింట్లో పాత నౌకరొకామె వొద్దన్నా రోజూవొచ్చి అన్నీ సెప్తాది. కొన్ని కండ్లకు కనబడతానే వుండాయి. అమ్మగారు శానా మంచిదా? అంత డబ్బుండాదా? పెద్ద డాకటర్లే సూస్తావున్నారా? బాగవడం లేదెందుకు? అది మనసులో ఖాయిలా గాబట్టి. గుండె, నరాలు వీకైపోయినాయని సెప్తావున్నారంట’

      ‘కొన్ని జబ్బులలాగే వుంటాయి’
‘మొన్నమొన్నటి దాంకా ఆమె సక్కగా, నవ్వతా తిరగతా వుండేదంట. దేవరాజుసారు అనుకున్నంత మంచోడు కాదు. శాన్నాళ్లుగా ఆతల్లిని లోలోపల బాదపెడతా వుండాడని నాకనిపిస్తా వుండాది’ 
      ‘నువ్వు నీ వుద్యోగానికి విశ్వాసంగా వుండాలి, నీ అభిప్రాయాలు, కోపతాపాలకు కాదు. యిది ఆధునికానంతర ప్రపంచం. పద, యికవెళ్దాం’
నా మాటలు అర్థంకానట్టుగా చూసి ‘అమ్మగారు వొక్కోతూరి వొంటరిగా రూములో కూస్సోని యేడ్సేది సూసినా. ఆయమ్మను సూస్తే       ‘రగతంకారి పడిపోయిన గౌరి’ గుర్తుకొచ్చి మనసు యికలమైతాది. వుండలేక నీకు సెప్తావున్నా’ అని కారు స్టార్ట్‌ చేశాడు పీరయ్య. 
మళ్లీ కొన్నాళ్లు పీరయ్య కనిపించలేదు.

తుఫాను మూలంగా ఆరోజు సాయంత్రంనుంచే పెద్దవర్షం మొదలైంది. ఈదురుగాలి, వణికించే చలి. కరెంటు పోయింది. తెల్లవారు ఝామున ఐదవుతూండగా వీధితలుపు కొట్టిన చప్పుడు రావడంతో టార్చిలైటు వేసి తలుపు తెరిచాను. 
     వరండాలో తడిసిన బట్టల్తో చేతిలో బ్యాగుతో నిలబడివున్నాడు పీరయ్య. మొహం గంభీరంగా ఉంది. ఆశ్చర్యపోయి అతన్ని హల్లోకి రమ్మని తువ్వాలు, పంచె ఇచ్చాను. అప్పటికి ఉద్ధృతి తగ్గి సన్నటి వర్షపుధార మిగిలింది.
కాఫీచేసి ఇచ్చాను. పీరయ్య పొడిబట్టలు కట్టుకుని మౌనంగా తాగాడు.
      ‘అర్జెంటుగా యెక్కడికన్నా వెళ్తున్నావా?’ నిదానంగా అడిగాను.
‘నేనుద్యోగం సాలించి వూరికి యెళ్లిపోతావుండా. సెప్పిపోదామని వచ్చినా’ అన్నాడు పీరయ్య బొంగురు గొంతుతో.
      ‘యేమైంది? మనవూరికిక వెళ్లనన్నావు గదా?’
పీరయ్య తటపటాయించాడు ‘దేవరాజుసారు మంచోడు కాదు బాబూ. నేను సెప్తావచ్చిందే నిజం. అమ్మగారిని శానా బాధపెడతా వున్నాడు. ఆమె యెక్కవ రోజులు బతకదు. బైట యెంత ఫ్యాక్చనిస్టైనా పెదలింగయ్యగారే మేలు, యేదున్నా పైక్కనపడతాడు, యింట్లో అమ్మయ్యదే పెత్తనం. యీసారు యేరే మనిసి’

‘అందుకని రాకరాక వచ్చిన మంచి వుద్యోగం మానేసి వెళ్తున్నావా?’ 
      ‘నా తల్లట్లాటి అమ్మగారికి అంత సెడు జరగతావుంటే సూస్తా ఆయింట్లో వుండలేను. యేమైండాదో విను. నిన్న అయ్యగారి డ్రైవరు లేడు, కారు నన్ను తోలమన్నాడు. మాటేల వొర్సం మొదులయ్యేతలికి మేం యాభైమైళ్ల దూరంలోవున్న వూరేదో యెళ్లినాం. వూరిబైట తోటలో గెస్టౌసు, అయ్యగార్దే అనుకుంటా. అప్పుటికే ఆడ రెండు పెద్దకార్లొచ్చి వుండాయి’
‘వుంటే?’ 
      ‘నేను రాత్రి తొమ్మిదైనాక మంచినీళ్ల కోసమని యింటి యెనకపక్కకు యెళ్లా, వొరండాలో అయ్యగారు, యిద్దురు దోస్తులు కూస్సోని మందు తాగతావుండారు. వోళ్ల మాటలు యినబడినాయి. ‘ఆమెకు ఖాయిలా అనీ, యింగేయో సాకులు సూపి అమ్మగార్ని వొప్పించేదానికి సూస్తావుండానని, తొందర్లోనే యెట్లైనా యేదోవొకటి సేసి సంతకాలు పెట్టిస్తానని, ఆనక వోళ్లనుకున్న యాపారాల్లో యెంత డబ్బైనా పెడ్తానని అయ్యగారు సెప్తావున్నాడు’

‘అవునా?’ 
     ‘నాకు కోపం తన్నుకోనొచ్చింది. ‘అర్జెంటు పనుండాదని’ అయ్యగార్ని పక్క రూంలేకి తీసకపోయి ‘నువ్విట్లా సేస్తావుండేది శానా తప్పయ్యగారూ, దేవతట్లాటి అమ్మగార్ని పోగొట్టుకోవద్దు’ అని యినయంగానే సెప్పినా. ఆయన నన్ను తిట్టినాడు, బెదిరిచ్చినాడు, నేను బైపడలేదు. జీతం పెంచుతానని అశ పెట్టినాడు’ అని చీకట్లోకి చూస్తూ ఆగాడు.
      నేను ఏమనాలో తెలియక అలాగే చూస్తూండిపోయాను.
పీరయ్యే మళ్లీ ‘నాకు యిరక్తొచ్చింది. కారు బీగంచెవులు ఆయనముందు యిసిరేసి బైటికొచ్చేసినా. వానలో రెండుమైళ్లు నడిసి, రోడ్డుమీదికొచ్చి పాలయాను, లారీ యెక్కి వూర్లేకొచ్చి యింటికి సేరినాను. టైము నాలుగుదాటింది. అమ్మగారు అప్పుడే లేచినారు. యేదైతే అదైందని అమెకు జెరిగిందంతా సెప్పి వచ్చేసినా‘ అని అలసినట్టుగా గోడకు తలానించి కళ్లు మూసుకున్నాడు.

హింసను ఒక మార్గంగా ఒప్పుకుని, భార్యను చంపినవాడిగా శిక్షను అనుభవించి, అనాగరికుడని ముద్రపడ్డ పీరయ్య నాగరిక సమాజంలోని పరోక్ష గృహహింసను చూసి తట్టుకోలేకపోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. వర్షం ఆగింది, చీకటి ఇంకా విడలేదు. 
      ‘మనపల్లెలోనే యెట్నో బతుకుతా. యెప్పుడైనా వొచ్చి నిన్ను సూసిపోతుంటా. వస్తా బాబూ’ అని బ్యాగు బుజానికి తగిలించుకుని బయటికి వెళ్లిపోయాడు పీరయ్య. – డా.కె.వి. రమణరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement