
ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 0.8 శాతంగా (రూ.13,163 కోట్లు) ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. ఆర్‌బీఐ నుంచి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ రావడం ఇందుకు అనుకూలించింది. డివిడెండ్, ప్రాఫిట్స్ కింద ప్రభుత్వం రూ.2.78 లక్షల కోట్లను అందుకున్నట్టు సీజీఏ తెలిపింది.
2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం (రూ.15.69 లక్షల కోట్లు)గా ఉంటుందని బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 3.1 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వరకే చూస్తే ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 11.9 శాతం (రూ.1.86 లక్షల కోట్లు)గా ఉండడం గమనించొచ్చు.
ఏప్రిల్, మే నెలలకు కలిపి రూ.3.5 లక్షల కోట్ల పన్నుల రూపంలో, రూ.3.56 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో సమకూరింది. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ రూపంలో రూ.25,224 కోట్లు వచ్చింది. వ్యయాలు రూ.7.46 లక్షల కోట్లుగా ఉన్నాయి.