శ్రీశైలానికి మళ్లీ పెరిగిన వరద | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి మళ్లీ పెరిగిన వరద

Published Sun, Oct 2 2022 3:49 AM

Srisailam floods again raised Andhra Pradesh - Sakshi

శ్రీశైలం ప్రాజెక్ట్‌: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో  నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతోంది. శనివారం సాయంత్రం జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 1,85,809 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 13.382 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 10.682 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.

వీటి ద్వారా 50,307 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 8,666 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 1,350 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,033 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 196.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 881.60 అడుగులకు చేరుకుంది. 

సాగర్‌ ఆరు గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు 
విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌కు ఎగువ నుండి వచ్చే వరద పెరగడంతో శనివారం ఆరు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయానికి శ్రీశైలం నుంచి వచ్చే నీటితోపాటు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. మొత్తం 88,997 క్యూసెక్కులు జలాశయానికి వస్తోంది. దీంతో సాగర్‌ జలాశయం నీటిమట్టం మరోసారి గరిష్ట స్థాయి 590.00 అడుగులకు చేరింది.

ఆరు గేట్ల ద్వారా 48,600 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 26,552 క్యూసెక్కులతో కలిపి మొత్తం 75,152 క్యూసెక్కులు సాగర్‌ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలు, వరద కాలువ, ఎస్‌ఎల్‌బీసీలకు 13,845 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement