టెన్త్‌ పరీక్ష పేపర్ల లీకేజీ వార్తలపై మంత్రి బొత్స క్లారిటీ

Minister Botsa Satyanarayana Gives Clarity on Tenth Question Paper Leak - Sakshi

సాక్షి, విజయవాడ: టెన్త్‌ పరీక్ష పేపర్ల లీకేజీ అవాస్తవమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పేపర్లు లీక్‌ అయినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. తప్పుడు ప్రచారం చేస్తోన్న ఎల్లో మీడియాను చూడొద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులను మనో వేదనకు గురిచేయడం సరికాదన్నారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం (ఏప్రిల్‌ 27) నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్నటి రోజున ఒక సంఘటన జరిగింది. ఈరోజు కొన్ని ఛానల్స్‌లో కొన్ని పుకార్లు వచ్చాయి. నంద్యాలలోని ఒక స్కూల్‌లో సిబ్బంది పేపర్‌ను క్లర్క్ ఫోటో తీశాడు. 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమైన తర్వాత 9:45కు ఫోటో బయటికి వచ్చింది. కొందరి టీచర్ల ప్రమేయంతో ఓ క్లర్క్ ఫోటోలు తీసి పంపించారు. విషయం తెలియగానే జాగ్రత్తపడ్డాం.

పరీక్ష ప్రారంభమైన తర్వాత ఫోటో బయటికి వస్తే లీక్ ఎలా అవుతుంది. బాధ్యులపై చర్యలకు ఆదేశించాం చర్యలు తీసుకున్నాం. ఈ రోజు కూడా 9:45 గంటలకు ఏబీఎన్ ఛానల్‌లో స్క్రోలింగ్ వచ్చింది. సరుబుజ్జిలి మండలంలో జరిగినట్లు తెలియగానే ఎంక్వైరీ చేశాం. నిన్న కానీ, ఈరోజు కానీ ఎక్కడా పేపర్ లీక్ కాలేదు. కొందరు దురుద్ధేశంతోనే ఇలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్లకేమొస్తుంది. నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్, ఎన్నారై స్కూల్ సుధాకర్‌ను అరెస్ట్ చేశాం. ఈ స్కూళ్ల పేర్లే ఎందుకు బయటికి వస్తున్నాయో అందరూ గమనించాలి. చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకూడదని పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం.

చదవండి: (పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ.. సంచలన విషయాలు వెలుగులోకి)

దుష్ప్రచారం చేయడం వల్ల ఆ పేపర్లు, టీవీలకు వచ్చే లాభమేంటో చెప్పాలి. ఈ ఏడాది నుంచి కొత్త విధానానికి శ్రీకారం చుట్టాం. 24 పేజీల బుక్‌ను ప్రత్యేకంగా పరీక్ష రాసే విద్యార్ధులకు ఇచ్చాం. కానీ బడ్డీ కొట్లో ఆన్సర్ షీట్లు దొరికాయని తప్పుడు ప్రచారం చేశారు. 6 లక్షల మంది విద్యార్ధులను మనోవేదనకు గురిచేస్తున్నారు. దొంగ ఎప్పుడూ పోలీస్ కంటే తెలివిగా ఉంటాడు. అందుకే ఏచిన్న పొరబాటు కూడా లేకుండా మేం జాగ్రత్తలు తీసుకున్నాం.

ఈ వారం రోజుల పాటు ఏబీఎన్, టీవీ5, ఈటీవీ చూడకండి.. పేపర్లు చదవకండి. ఆ టీవీలు చూసి మనోధైర్యాన్ని కోల్పోకండి. విద్యార్ధులందరూ చక్కగా చదువుకుని పరీక్షలు రాయండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ అరెస్ట్ అయ్యారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడు. ట్విట్టర్‌లో ట్వీట్లు చేసే లోకేష్ ఏం చెబుతాడు. ఈ రెండు రోజుల్లో పేపర్లు ఎలాంటి లీక్ కాలేదు అని ప్రభుత్వం తరపున స్పష్టం చేస్తున్నా. మాస్ కాపీయింగ్ చేసేందుకు పన్నిన కుట్రను భగ్నం చేశాం. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు అని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top