నాటి పేపర్‌ బాయ్‌.. నేడు అమెరికాలో సైంటిస్టు  | Sakshi
Sakshi News home page

నాటి పేపర్‌ బాయ్‌.. నేడు అమెరికాలో సైంటిస్టు 

Published Mon, Feb 20 2023 11:37 AM

Kadapa: Paper Boy Of Yesteryear Is Now A Scientist In America - Sakshi

కడప సెవెన్‌రోడ్స్‌(వైఎస్సార్‌ జిల్లా): కన్నవారు దూరమైన దుర్భర బాల్యం. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దైన్యం. అవమానాలు, ఆటంకాలు, మరెన్నో ప్రతిబంధకాలు. కష్టాలన్నీ కట్టకట్టుకు వచ్చినా ఆయన పట్టుదల, పరిశ్రమ ముందు అవి తలవంచక తప్పలేదు. బాల్యంలోనే ఎన్నో సవాళ్లను చెరగని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఒకప్పుడు వీధుల్లో పేపర్‌ బాయ్‌గా తిరిగిన ఓ యువకుడు అంచెలంచెలుగా ఎదిగి నేడు అమెరికాలో మంచి సైంటిస్టుగా రాణిస్తున్నారు.

ప్రస్తుతం ‘‘సెంటర్‌ ఫర్‌ రీ జనరేటివ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌’’ డిప్యూటీ డైరెక్టర్‌గా మల్టీ డిసిప్లినరి రీసెర్చి ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు. ఎన్నో అద్భుత విజయాలు తన ఖాతాలో వేసుకుని నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కడప నాగరాజుపేటకు చెందిన  ఆయన పేరు డాక్టర్‌ రావూరి సుదీర్‌కుమార్‌.

బాల్యం గడిచిందిలా! 
పసితనంలోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అవ్వ చల్లా కమలమ్మ అక్కున చేర్చుకుంది. ఐదవ తరగతి వరకు నాగరాజుపేట గుండాచారి బడిలో చదువుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయురాలైన అవ్వ కమలమ్మకు చదువు విలువ ఏమిటో బాగా తెలుసు. చదువే నిజమైన ఆస్తి అంటూ మనవడికి తరచూ నూరిపోసేది. అవ్వ మాటలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. గుంతకల్లు, గుత్తిలో పిన్ని ఇంట హైస్కూల్‌ విద్యాభ్యాసం సాగింది.

సైన్స్‌ పట్ల జిజ్ఞాస 
గుత్తి రైల్వే ఇంగ్లీషు మీడియం హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆకుల నుంచి విద్యుత్‌ తయారవుతుందని ‘ఎలక్ట్రానిక్స్‌ ఫర్‌ యూ’ అనే పత్రికలో చదివాడు. అందుకు జిల్లేడు, బొంత జెముడు ఆకులు పనికి వస్తాయని సు«దీర్‌ కనుగొన్నారు. ఇలా ఆయన బయో లాజికల్‌ బ్యాటరీ తయారు చేశాడు. అప్పట్లో హైదరాబాదులో జరిగిన సైన్స్‌ ఫెయిర్‌లో రాష్ట్రపతి వెంకట్రామన్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. సిమ్లాలో జరిగిన ఇంటర్‌ స్టేట్‌ సైన్స్‌ ఫెయిర్‌కు ఈ ప్రయోగం ఎంపికైంది.

ఇంటర్మీడియేట్‌ కడప సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాలలో, 1994–97లో ఆర్ట్స్‌ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. తాను ఇంకొకరికి భారం కారాదని భావించి పేపర్‌ బాయ్‌గా, వీడియో కెమెరామెన్‌గా కొన్నాళ్లు పనిచేశారు. గ్రూప్‌-4, బ్యాంకు పరీక్షలు రాశారు. బీఈడీలో ఉచిత సీటు వచ్చింది. సైంటిస్టు కావాలన్న బలమైన ఆకాంక్ష వల్ల వాటిని వదులుకున్నారు.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ వైరాలజీ ప్రవేశానికి కిశోర్‌ అనే స్నేహితుడు రూ. 400 సాయం చేసి దరఖాస్తు చేయించగా సీటు వచ్చింది. తిరుపతిలో ఉన్న మరో పిన్ని ఇంటిలో ఉంటూ చదువు కొనసాగించారు. తన ఖర్చులు తాను సంపాదించుకోవాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పార్ట్‌ టైం అధ్యాకునిగా పనిచేశారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తన జుట్టు తానే కట్‌ చేసుకోవడం నేర్చుకున్న ఆయన ఒక సెలూన్‌ కూడా ప్రారంభించాలని భావించారు.

వెటర్నరీ వైరాలజీ పైన ఎమ్మెస్సీ ప్రాజెక్టు వర్క్‌ను తిరుపతిలో చేశారు. 1999లో ఎమ్మెస్సీ పూర్తయ్యాక అక్కడి కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌లో ఐసీఏఆర్‌–ఐఏఆర్‌టీ ఫెలోషిప్‌ జాబ్‌ చేశారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకులో ఉన్న బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ)లో మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌పై పనిచేశారు. వెటర్నరీ బయోలాజికల్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో డయాగ్నస్టిక్స్‌ చేశారు. ఈ సమయంలో రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఉద్యోగం వచ్చింది.

అయితే అదే సమయంలో ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో హెచ్‌ఐవీ–1పై పనిచేసే అవకాశం తలుపు తట్టగా, దాన్నే ఎంచుకున్నారు. దీంతో ఆయన జీవితం పెద్ద మలుపు తిరిగింది. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తిలో రోగ నిరోధకశక్తి తగ్గిపోయి త్వరగా మరణానికి చేరువవుతాడు. అలాంటి వ్యక్తుల్లో వచ్చిన జన్యుపరమైన మార్పులను గుర్తించి దానికి తగ్గట్టు కాంబినేషన్‌ మందుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంపై పరిశోధన చేశారు. ఆయనకు 2006లో పీహెచ్‌డీతోపాటు పేటెంట్‌ హక్కులు లభించాయి.

అమెరికాలో పరిశోధనలు 
సుదీర్‌ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోగల పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీకి పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌పై వెళ్లారు. మెంటార్‌గా కూడా పనిచేశారు. రీసెర్చి అసోసియేట్‌గా తొమ్మిదేళ్లు పిట్స్‌బర్గ్‌లో ఉన్నారు. నిర్వీర్యం చేసిన హెచ్‌ఐవీ వైరస్‌లోకి ఉపయోగకరమైన జన్యువులను పంపి తద్వారా వచ్చిన నిర్వీర్య వైరస్‌ను మూల కణాల ఉత్పత్తి, రొమ్ము క్యాన్సర్‌ నిరోధానికి ఉపయోగించడంపై పరిశోధన చేశారు.

కొలరాడోలోని స్టెడ్‌మన్‌ ఫిలిప్పన్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌పీఆర్‌ఐ)లో ‘వార్థక్య దశకు చెందిన కణాలను గుర్తించి నిర్మూలించడం ద్వారా మెరుగైన వృద్ధాప్య జీవితం’ అనే అంశంపై పరిశోధన చేశారు. అక్కడి ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో కలిసి జీన్‌ థెరఫి, స్టెమ్‌సెల్‌ బయాలజీ, టిష్యూ ఇంజినీరింగ్‌ అంశాల్లో పనిచేశారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్, డిపార్టుమెంటు ఆఫ్‌ డిఫెన్స్, యూఎస్‌ ఒలంపిక్‌ అండ్‌ పారాలింపిక్‌ నేషనల్‌ మెడికల్‌ సెంటర్‌లో పరిశోధనలు చేశారు.

గ్రాంట్‌ అవార్డ్స్‌ 
ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా ప్లాస్టిక్‌ సర్జరీ ఫౌండేషన్‌ గ్రాంటు, కో ఇన్వెస్టిగేటర్‌గా ఎన్‌ఐహెచ్, డీఓడీ ప్రభుత్వ గ్రాంటు, కో ప్రిన్సిపల్‌ సైంటిస్టుగా ప్రైవేటు ఇండస్ట్రీ ఫండింగ్‌ లభించాయి. ఎడిటోరియల్‌ బోర్డు మెంబర్, గెస్ట్‌ ఎడిటర్, సైంటిఫిక్‌ రివ్యూవర్‌గా పలు అంతర్జాతీయ రీసెర్చి జనరల్స్‌లో పనిచేశారు. పలు సైంటిఫిక్‌ సమ్మిట్స్‌కు చైర్‌ పర్సన్, కో చైర్‌ పర్సన్‌గా వ్యవహరించారు. కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీలో అఫిలియేట్‌ సైంటిస్టుగా నియమితులయ్యారు. కండరాల్లో మూల కణాలు కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ జానీ హువర్డ్‌తో కలిసి ప్రస్తుతం సెంటర్‌ ఫర్‌ రీ జనరేటివ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ (సీఆర్‌ఎస్‌ఎం)లో మల్టీ డిసిప్లినరీ రీసెర్చి ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు.
చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా?

ఆకాంక్షతోపాటు నిరంతర కృషి అవసరం 
ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి వెళ్లాలన్న ఆకాంక్ష ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టు నిరంతర కృషి ఉన్నప్పుడే లక్ష్యాన్ని అందుకోగలమని విద్యార్థులు గుర్తించాలి. నిరుత్సాహ పడకుండా అవకాశాలు వచ్చేంత వరకు ఓపిక అవసరం. ఒకప్పుడు ఏమీ లేని నేను ఇప్పుడు ఒక స్థాయి లో ఉన్నానంటే అది మా అవ్వ కమలమ్మ, మా ఇద్దరు పిన తల్లులతోపాటు స్నేహితులు కిశోర్, ప్రసాద్, రాజు, మేనమామ చల్లా రాజేంద్ర వరప్రసాద్‌ (సీఆర్‌వీ ప్రసాద్‌), టీచర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన సహకారమే కారణం.     – -డాక్టర్‌ రావూరి సుధీర్‌కుమార్, నాగరాజుపేట, కడప  

Advertisement
 
Advertisement
 
Advertisement