
పుట్టపర్తిలో డీఎస్పీ ఆదినారాయణకు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు
తప్పుడు కేసుతో రిమాండ్‌కు తరలింపు
టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు
జిల్లావ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల పోలీసులు ‘సాక్షి’ విలేకరి రఘునాథరెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేసి ఆయనను బుధవారం జైలుకు పంపారు. దీనిపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాత్రికేయులు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విలేకరిపై పెట్టిన తప్పుడు కేసును తక్షణం ఎత్తేయాలని జర్నలిస్టు నేతలు డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ వి.రత్నను కలిసేందుకు ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, కార్యదర్శి బాబు తదితరులు వెళ్లగా.. ఆమె అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ ఆదినారాయణకు వినతిపత్రం అందజేశారు.
పాత్రికేయులపై ఇలా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం మంచిది కాదని పోలీసుల తీరును, ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కదిరి డీఎస్పీ శివనారాయణస్వామికి సైతం స్థానిక విలేకరులు వినతిపత్రం అందజేశారు. సాక్షి విలేకరిపై పెట్టిన కేసును సమగ్రంగా విచారించి తగు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రఘునాథ్‌రెడ్డిపై అక్రమ కేసు ఎత్తివేయాలని కోరుతూ హిందూపురం ప్రెస్‌క్లబ్ సభ్యులు వన్‌టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడుకు వినతిపత్రం అందించారు. ఏపీయూడబ్ల్యూజే తాడిమర్రి మండల కమిటీ సభ్యులు ఏఎస్‌ఐ సూర్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. తప్పుడు కేసు ఎత్తేయాలంటూ జిల్లాలో పలుచోట్ల పాత్రికేయులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
టీడీపీ నేతల ఒత్తిడితోనే..
తలుపుల మండల టీడీపీ కార్యకర్త నవీన్ ఈ నెల 28న పట్టపగలు రాజనోళ్లపల్లి సర్పంచ్ సుగుణమ్మ ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కున్నాడు. నైలాన్ తాడుతో ఆమె గొంతు బిగించి చంపాలని కూడా చూశాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో తాను దొంగ అనే విషయం ఊరందరికీ తెలిసిపోయిందనే భావనతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితురాలు సుగుణమ్మతో పాటు మరో ఏడుగురిపై హత్య కేసు పెట్టారు. ఈ కేసులో ఆ మండల ‘సాక్షి’ విలేకరి రఘునాథరెడ్డిని కూడా ఏ–2 నిందితుడిగా చేర్చి రిమాండ్‌కు తరలించారు.