
వారం రోజుల పాటు తేలికపాటి వర్షాలు
సాక్షి, అమరావతి, విజయపురిసౌత్: నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ఇది దక్షిణ తమిళనాడు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. అలాగే ఏపీ తీరప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్రలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని, కొద్దిచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొన్నారు. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సోమవారం ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
మిగిలిన జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడిరంలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పల్నాడు జిల్లా గుట్లపల్లిలో 6, నెల్లూరు జిల్లా జలదంకిలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సాగర్‌లో మూతపడ్డ క్రస్ట్‌గేట్లు..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తగ్గటంతో అధికారులు ఆదివారం క్రస్ట్‌గేట్లు మూసివేశారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 63,398 క్యూసెక్కులు వచ్చి చేరటంతో ఇక్కడ నుంచి 55,537 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 10,040, ఎడమ కాలువకు 8,896, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,901, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 305.8030 టీఎంసీల నీరు నిల్వ ఉంది.