బలపడిన అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

Heavy Rain Forecast For Costal Area Rayalaseema Andhra Pradesh - Sakshi

24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

48 గంటల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం 

నేడు, రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయల సీమల్లో మోస్తరు వానలు 

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

సాక్షి, అమరావతి, విశాఖపట్నం:  వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. 48 గంటల్లో బలపడి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్‌ నుంచి అల్పపీడనం ప్రాంతం మధ్యగా పయనిస్తూ అండమాన్‌ వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.

గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. కాగా,  శనివారం అర్ధరాత్రి, ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 8.9 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, సంతబొమ్మాళి ప్రాంతాల్లో, రాజమహేంద్రవరంలో, ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top