నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఫీవర్‌ సర్వే

Fever Survey In The State From Today - Sakshi

ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలి

వీరి వివరాలు ఆశా కార్యకర్తలు ఏఎన్‌ఎంకు అందించాలి

తర్వాత వలంటీర్ల ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి

జ్వర బాధితులకు కోవిడ్‌ టెస్టులు, చికిత్స, సలహాలు

కోవిడ్‌ బాధితులను ముందుగా గుర్తించడమే లక్ష్యం

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా శుక్రవారం నుంచి ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్‌ఎంలు మే 7 నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. రాష్ట్రంలో గతంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి జ్వర బాధితులను గుర్తించారు. అంతేకాకుండా వారికి వెంటనే కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసి.. లక్షణాలు ఉన్నవారికి అవసరమైన చికిత్స, సూచనలు, సలహాలు అందించిన సంగతి తెలిసిందే.

ప్రత్యేక యాప్‌లో నమోదు..
ఫీవర్‌ సర్వేలో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉన్నాయో, లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉంటే.. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి.. వారి వయసు వంటి వివరాలను ఏఎన్‌ఎంకు తెలియజేయాలి. ఏఎన్‌ఎం ఈ వివరాలను గ్రామ/వార్డు వలంటీర్ల ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. తర్వాత జ్వర లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ టెస్టులో కరోనా పాజిటివ్‌గా తేలితే.. వెంటనే 104 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి తీవ్రతను బట్టి హోం ఐసొలేషన్‌ కిట్‌ ఇవ్వలా లేదా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపడం లేదా ఆస్పత్రికి పంపాలా అనేది నిర్ణయిస్తారు.

ముందుగానే గుర్తించి ఐసొలేషన్‌కు పంపే అవకాశం..
ఈ నెల 4న ఐసీఎంఆర్‌ (భారతీయ వైద్య పరిశోధన మండలి) కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో పాజిటివ్‌ వస్తే ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించాల్సిన పనిలేదని.. ఆయా కేసులను పాజిటివ్‌గానే గుర్తించి.. వారికి వైద్య సేవలు అందించాలని సూచించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. జిల్లా కలెక్టర్లు, జిల్లా డీఎంహెచ్‌వో (ఆరోగ్యశాఖ అధికారులు)లు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫీవర్‌ సర్వేలో ఆశా కార్యకర్తలు కోవిడ్‌ నిబంధనలు అనుసరించాలని సూచించింది. సర్వే చేయడం వల్ల బాధితులను ముందుగానే గుర్తించి ఐసొలేషన్‌కు పంపే అవకాశం ఉంటుందని, తద్వారా కోవిడ్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. దీంతోపాటు ప్రతి కంటైన్మెంట్‌ జోన్‌లోనూ ఫీవర్‌ క్లినిక్స్‌ నిర్వహించి వైద్యం అందిస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top