బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేయొచ్చు | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేయొచ్చు

Published Wed, Mar 8 2023 4:07 AM

Bank accounts can be frozen by ED - Sakshi

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్‌–3 వాహనాలను తుక్కు కింద కొని, బీఎస్‌–4 వాహనాలుగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బినావీులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసేలా ఉత్తర్వులు జారీ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు హైకోర్టు వెసులుబాటునిచ్చింది. మనీ లాండరింగ్‌ చట్టం సెక్షన్‌ 17 ప్రకారం సంబంధిత అధీకృత అధికారి చర్యలు చేపట్టవచ్చునని స్పష్టం చేసింది.

ప్రభాకర్‌రెడ్డి బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవ్వా గోపాల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, భార్య లక్ష్మీదేవి పేరు మీద ఉన్న యాక్సిస్, యూనియన్‌ బ్యాంకుల ఖాతాల నుంచి 15 రోజుల పాటు ఎలాంటి నగదు లావాదేవీలు జరపడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఈడీ అధీకృత అధికారి సెక్షన్‌ 17 (1)(ఏ) కింద జారీ చేసే ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఇదే సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మీదేవి బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి డెబిట్‌ లావాదేవీలు జరగకుండా స్తంభింపచేయాలంటూ యాక్సిస్, యూనియన్‌ బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పంపిన ఈ–మెయిళ్లను రద్దు చేసింది.

సెక్షన్‌ 17 (1)(ఏ) కింద జారీ చేయని కారణంతోనే ఈ–మెయిళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ మంగళవారం తీర్పునిచ్చారు. అశోక్‌ లేలాండ్‌ సంస్థ నుంచి బీఎస్‌–3 వాహనాలను తుక్కు కింద కొని, బీఎస్‌–4 వాహనాలుగా మార్చిన వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బినావీులపై పోలీసులు 46 కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది.

కొల్లగొట్టిన సొమ్మును ప్రభాకర్‌రెడ్డి బినామీ గోపాల్‌రెడ్డి తన కుమారుడు, భార్య బ్యాంకు ఖాతాల్లో దాచినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి డెబిట్‌ లావాదేవీలు జరగకుండా చూడాలంటూ యాక్సిస్, యూనియన్‌ బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఈ–మెయిళ్లు పంపారు. బ్యాంకు అధికారులు లావాదేవీలు నిలిపివేశారు.

ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఈ–మెయిళ్లను సవాలు చేస్తూ గోపాల్‌రెడ్డి అండ్‌ కో, దాని మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ గోపాల్‌రెడ్డి, ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, భార్య లక్ష్మీదేవీలు హైకోర్టులో 2022లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి రవినాథ్‌ తిల్హరీ గత నెలలో పూర్తిస్థాయిలో వాదనలు విన్నారు. ఈడీ తరఫున జోస్యుల భాస్కరరావు, పిటిషనర్ల తరఫున న్యాయవాది ఐ.కోటిరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ తిల్హరీ మంగళవారం తన నిర్ణయాన్ని 
వెలువరించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement