కాషాయదళంలో జోష్..
● బల్దియాలో మెజార్టీ స్థానాలు కై వసం ● రెండో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ ● సత్తా చాటిన స్వతంత్రులు ● ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ‘కమలం’ వికసించింది. కాషాయ పార్టీ మెజార్టీ సీట్లను కై వసం చేసుకుంది. పీఠంపై దస్తీ వేసి ఖాయం చేసుకుంది. పట్టణంలోని 49వార్డులకు గాను ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పట్టణంలోని టీటీడీసీలో శుక్రవారం చేపట్టారు. నాలుగు హాళ్లలో ఒక్కో వార్డుకు ఒక టే బుల్ ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా కౌంట్ చేశారు. పలు వార్డుల ఓట్ల లెక్కింపు రెండు రౌండ్లలోనే పూర్తయ్యాయి. రెండు, మూడు వార్డులు మాత్రమే మూడు, నాలుగు రౌండ్లలో చేపట్టారు. మధ్యాహ్నం 12గంటలకు తొలి ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. 37వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుష్మా తొలి విజేతగా నిలిచారు. చివరగా 4వ వార్డు ఫలితాన్ని ప్రకటించా రు. ఇందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించడం గమనార్హం. అభ్యర్థులు, వారి ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు ఫలితాలను వీక్షించేలా ప్రత్యేక స్క్రీన్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వార్డులు, రౌండ్‌ల వారీగా ఫలితాలను ప్రకటించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లెక్కింపు కేంద్రంలోనే ఉండి ఆధ్యంతం ప్రక్రియను పరిశీలించారు. ఫలితాలు త్వరితగతిన వెలువడేలా ఆర్‌వోలకు సూచించారు. కౌంటింగ్ అనంంతరం విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు ఆయా వార్డుల రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
11 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్..
పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటి మెజార్టీ సర్పంచ్ పదవులను కై వసం చేసుకున్న అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో దాన్ని కొనసాగించలేకపోయింది. 49వార్డుల్లో పోటీ చేయగా కేవలం 11స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక బీఆర్‌ఎస్ ఆరు వార్డుల్లో గెలుపొంది ఉనికిని చాటుకుంది. 19 వార్డుల్లో పోటీ చేసిన ఎంఐఎం ఆరు చోట్ల మాత్రమే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు మాత్రం సత్తా చా టారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ముగ్గురు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. 43వ వార్డు నుంచి కలాల్ శ్రీనివాస్ విజయం సాధించగా, 45వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్ బండారి సతీశ్ తన సతీమణి అనూషను పోటీలో నిలిపి గెలిపించుకున్నారు. 39వ వార్డు నుంచి యోగేష్ తన సతీమణి శాలిని బరిలో నిలిపి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వీరితో పాటు మరో ముగ్గురు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి తమ సత్తా చాటుకున్నారు.
పార్టీల వారీగా గెలుపొందిన
కౌన్సిలర్ల వివరాలు
బీజేపీ
మొత్తం : 49
కాంగ్రెస్
ఏఐఎంఐఎం
బీఆర్‌ఎస్
ఇండిపెండెంట్లు
పోస్టల్ బ్యాలెట్లలోనూ
ఆధిపత్యం..
2020లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో 11 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో సత్తా చాటింది. అత్యధికంగా 21 వార్డులను కై వసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. చైర్‌పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకోబోతోంది. రెండు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాయి. ఏదేమైనా మెజార్టీ స్థానాలు దక్కడం కమలదళంలో నూతన ఉత్సాహాన్ని నింపింది. తొలిసారిగా మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండా ఎగరనుంది. అయితే ఫలితాలు వెలువడిన వెంటనే ఇండిపెండెంట్లుగా గెలుపొందిన పలువురు అభ్యర్థులను ఆ పార్టీ నేతలు క్యాంపులకు తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఘన విజయం సాధించడంపై శ్రేణులు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు.
తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలోనూ బీజేపీ అభ్యర్థులు ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 425 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా అందులో బీజేపీ అభ్యర్థులకు 167, కాంగ్రెస్ అభ్యర్థులకు 113, బీఆర్‌ఎస్ 79, ఇతరులకు 55 ఓట్లు వచ్చాయి. మరో ఏడు ఓట్లు చెల్లకుండా పోగా నాలుగు ఓట్లు నోటాకు వచ్చాయి.


