పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టగా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఐలవ్‌యూ ఆదిలాబాద్ నుంచి కేఆర్‌కే వైపు వెళ్లే రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మూడంచెల భద్రత చేపట్టారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతించారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆంక్షలు కొనసాగాయి. గెలుపొందిన అభ్యర్థులు ఆయా కాలనీల్లో టపాసులు పేల్చకుండా, సంబరా లు, ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో టుచేసుకోకుండా ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రక్రియను ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు నాగరాజు, సునిల్ కుమార్, మావల సీఐ కర్రె స్వామితో పాటు ఎస్సైలు, పోలీసులు పర్యవేక్షించారు.


