ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్ని కుప్పిగంతులు వేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని టీఆర్‌ఎస్
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
నల్లగొండ టూటౌన్ : ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్ని కుప్పిగంతులు వేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 16వ వార్డులో సీసీ రోడ్డు. డ్రెయినేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు రోజుకో విధంగా మాట్లాడుతున్నారని, తప్పు చేయలేదని ఆయన ఇప్పటివరకు ఒక్కమాట చెప్పకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం నీచమైన సంస్కృతి పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన బాబు బుకాయింపు మాటలకు ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు తమ ప్రభుత్వం భయపడదన్నారు. పదేళ్ల పాటు సీఎంగా పని చేసిన బాబు కనీస అవగాహన లేకుండా టీ న్యూస్ చానల్‌కు నోటీసు ఇవ్వడం అవివేకమన్నారు. నల్లగొండను స్మార్ట్ సిటీగా ఎంపిక చేసేందుకు సీఎం దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్ అబ్బగోని కవిత, నాయకులు అబ్బగోని రమేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.