సిద్దిపేట రక్షణ కోట! | Siddipeta Protection of the castle! | Sakshi
Sakshi News home page

సిద్దిపేట రక్షణ కోట!

Oct 13 2014 2:05 AM | Updated on Aug 14 2018 3:37 PM

సిద్దిపేట రక్షణ కోట! - Sakshi

సిద్దిపేట రక్షణ కోట!

సిద్దిపేట పాతబస్టాండ్ ప్రాంతం.. బుధవారం.. ఉదయం.. రాజు అనే యువకుడు తనబైక్ పార్క్ చేశాడు.. గంటసేపు జిమ్‌లోకి వెళ్లి వచ్చాడు..

‘ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ అనే తరహాలో మంత్రి వర్యులకు వచ్చిన ఓ ఆలోచన చోరాగ్రేసరుల ఆట కట్టించనుంది. అంతకంతకు పోలీసులకు సవాలుగా నిలుస్తూ సామాన్యుల జేబుల పాలిట కత్తెర్లగా మారుతున్న దొంగలకు సీసీ కెమెరాలు చెక్ పెట్టనున్నాయి. ఆ వివరాలేంటో చూద్దామా!
 
చోరీలకు ఇక చెక్

* హరీష్‌రావు పకడ్బందీ ప్లాన్
* 120 సీసీ కెమెరాలతో నిఘా
* కీలక ప్రాంతాల ఎంపిక
* ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుకు రంగం సిద్ధం
సిద్దిపేట టౌన్:సిద్దిపేట పాతబస్టాండ్ ప్రాంతం.. బుధవారం.. ఉదయం.. రాజు అనే యువకుడు తనబైక్ పార్క్ చేశాడు.. గంటసేపు జిమ్‌లోకి వెళ్లి వచ్చాడు..సీన్ కట్ చేస్తే బైక్ గాయబ్ (మాయం). ఇలాంటి చోరీలు సిద్దిపేటలో ఎన్నెన్నో. సిద్దిపేట రైతు బజార్‌లో సగటున వారానికి మూడు రోజులు సెల్‌ఫోన్లు, పర్సులు అపహరణకు గురవుతున్నాయి. పాపభీతి లేకుండా దేవాలయాల్లో సైతం దొంగతనాలు జరిగిపోతున్నాయి. ఇక బస్టాండ్, సుభాష్‌రోడ్ తదితర రద్దీ ప్రాంతాల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా సామాన్యులు తమ పర్సులను పోగొట్టుకుంటున్నారు.

ముఖ్యంగా సిద్దిపేటలో జరిగే వివిధ ఉత్సవాల్లో సందర్భంగా వేల మంది పోటెత్తుతున్న క్రమంలో కూడా గుర్తు తెలి యని వ్యక్తులు తమ చోరకళను ప్రదర్శిస్తున్నా రు. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో జరుగుతున్న అన్ని పోలీస్ స్టేషన్‌లకు వెళ్లడం లేదు. మిగి లిన వారి వేదన వ్యధగానే మిగిలిపోతోంది. పరిమితమైన పోలీస్ బలగాలు వీటిని సంపూర్ణంగా అరికట్టలేకపోతున్నాయి. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు.

వీటన్నింటికి చెక్ పెట్టడానికే సీసీ కెమెరాల ఏర్పాటు. మెదక్ జిల్లాలో సిద్దిపేట పెద్ద పట్టణం. సుమారు లక్ష మంది ప్రజలిక్కడ నివసిస్తుంటారు. సుమారు 60 గ్రామాలు, పట్టణాల నుంచి ప్రతి రోజు వివిధ పనులపై విభిన్న వర్గాల ప్రజలు 40 వేల మంది ఇక్కడికి వస్తుంటారు. సిద్దిపేట రోజు రోజుకు పెరిగిపోతుంది. చోరీలు కూడా పెరిగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేటలోని పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, సుభాష్‌రోడ్, మెయిన్‌రోడ్, లాల్‌కమాన్, గాంధీ చౌక్, మెదక్, హైదరాబాద్, కరీంనగర్ రోడ్, కూరగాయల మార్కెట్, రైతు బజార్, వ్యవసాయ మార్కెట్, ప్రధాన దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లు, ఏరియా ఆస్పత్రి, మాతాశిశు సంక్షేమ కేంద్రం, హైరిస్క్ ఆస్పత్రి మొదలగు కీలక ప్రాంతాలను మంత్రి హరీశ్‌రావు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు  చేయడానికి రంగం సిద్ధమైంది.

120 సీసీ కెమెరాలను ప్రత్యేక కంట్రోల్ రూంకు అనుసంధానిస్తారు. నిరంతరంగా పని చేసే కంట్రోల్ రూంలో ఉద్యోగి ఎప్పటికప్పుడు నిఘాను పరిశీలిస్తారు. ముఖ్యంగా ప్రత్యేక ఉత్సవాలు జరిగే సందర్భాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో నిఘాను ముమ్మరం చేస్తారు. తద్వారా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అదనపు బలగాలను అక్కడికి పంపిస్తారు. దీంతో పాటు రాత్రిళ్లలో నిఘా కొనసాగిస్తారు. ఒక వేళ ఎక్కడైన చోరీ చేసి ఆగంతకులు పారిపోయినా కూడా వారిని ఎక్కడో ఒక చోట గుర్తిస్తారు. తద్వారా చోరీలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు కిడ్నాప్‌లు, నేరాల్ని కూడా సీసీ కెమెరాలతో రికార్డు చేసి  నేరస్తులను పట్టుకోవడానికి, సంఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది.
 
నగరం తరహాలో సిద్దిపేటలో నిఘా

నగరాలలో జరుగుతున్న చోరీలను నియంత్రించడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అక్కడి తరహా నిఘాను సిద్దిపేటలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రాత్రిళ్లలో కూడా దృశ్యాలను బంధించే ఆధునిక సీసీ కెమెరాలు త్వరలో పని చేయబోతున్నాయి. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో కార్యరూపం దాలుస్తుంది.             
- హరీశ్‌రావు, రాష్ట్ర మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement