విద్యను సమాజ సేవకు ఉపయోగించాలి

RSS Chief Mohan Bhagwat At Alumni Gathering - Sakshi

30 కోట్ల మంది సేవ చేసినా దేశం ఉన్నతంగా ఉంటుంది

మనిషి ఆలోచనలకు మార్గం చూపే శిక్షణ అవసరం

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌

రాజేంద్రనగర్‌: మనిషి ఆలోచనలకు మార్గం చూపించే శిక్షణ అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. విద్యను స్వార్థం కోసం కాకుండా దేశ రక్షణ, సమాజ సేవ కోసం ఉపయోగించాలని సూచించారు. ఆదివారం బండ్లగూడ జాగీరులోని శారదా ధామంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం పూర్వ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మానవ జాతి అభివృద్ధి కోసం పర్యావరణానికి కీడు చేయవద్దని సూచించారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. సరస్వతి విద్యా మందిరాలు వ్యాపార ధోరణితో విద్యను బోధించడం లేదని.. సమాజ, దేశ సేవ కోసం బోధిస్తున్నాయని వెల్లడించారు. సంస్కృతి, సంప్రదాయాల విషయంలో భారతదేశం అన్ని దేశాలకు దిక్సూచిగా ఉందని కొనియాడారు.

దేశంలోని 130 కోట్ల మందిలో 30 కోట్ల మంది సేవ చేసినా దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు ఇంట్లోనే మన సంస్కృతి, సంప్రదాయాలను బోధించాలని.. వారితో మాతృభాషలోనే మాట్లాడాలని తల్లిదండ్రులకు సూచించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ సంస్కృతిని ప్రపంచదేశాలకు చాటాల్సిన అవసరం ఉందన్నారు. సరస్వతి విద్యా పీఠం ఇందుకు ఎంతగానో పాటుపడుతోందని కొనియాడారు.

అనంతరం సరస్వతి విద్యా పీఠం ఆధ్వర్యంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. విద్యారణ్య స్కూల్‌ భవనానికి విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సీబీఆర్‌ ప్రసాద్‌ రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో నిర్మించనున్న పాఠశాలకు రూ.12.5 కోట్ల విలువైన భవనాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, విద్యాభారతి అధ్యక్షుడు రామకృష్ణారావు, దక్షిణ మధ్య క్షేత్ర విద్యా భారతి అధ్యక్షుడు ఉమామహేశ్వర్, పారిశ్రామికవేత్త ఎంఎస్‌ఆర్‌వీ ప్రసాద్, సేవిక సమితి ప్రధాన కార్య దర్శి అన్నదాన సీతక్క తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థి సమ్మేళనం రికార్డులు..
సరస్వతి విద్యాపీఠం రాష్ట్రస్థాయి పూర్వ విద్యార్థి మహా సమ్మేళనం పలు రికార్డులను సాధించింది. ఈ సమ్మేళనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, అమెరికా, దుబాయ్‌ నుంచి 15 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు రాయల్‌ సక్సెస్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు నిర్వాహకులు వెల్లడించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవ్వడంతో పలు రికార్డులు సాధించిందని తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పరిషత్‌ సభ్యులకు రికార్డు పత్రాన్ని అందజేశారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పూర్తి నివేదికను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు, లింకా బుక్‌ ఆఫ్‌ రికార్డు నిర్వహకులకు అందిస్తున్నట్లు విద్యార్థి సమ్మేళనం సభ్యులు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top