ఉపాధ్యాయులపై నిందలు సహించం

Narsi Reddy Demands To Increase Retirement Of Employees - Sakshi

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నిందలు వేస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌ ఏదో ఒక సందర్భంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నిందలు వేస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పీఆర్‌సీని అమలు చేయాలని, ఉద్యోగులకు పదవీ విరమణ 60 ఏళ్లకు పెంచాలని, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

గతంలో అసెంబ్లీలో వీఆర్‌వోలు ఎంత పవర్‌ఫుల్‌ అంటే హోంమంత్రి మహమూద్‌ అలీ భూమిని వేరేవారి పేరున ఇతరుల భూమిని ఆయన పేరున మార్చే సత్తా ఉందని హేళన చేశారని అన్నారు. ప్రతిశాఖ ఉద్యోగులపై ఏదో ఒక సందర్భంలో నిందలు వేశారని, దీనిపై ప్రజలు ప్రశ్నించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల జేఏసీలు సీఎంకు బలం చేకూర్చేలా ఉన్నాయని, అన్ని జేఏసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకుడు బి.రాజేశం మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరం అన్నారు. పోరాటం చేస్తే తప్ప ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్షుడు జంగయ్య చెప్పారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ నాయకుడు కొండల్‌ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ కార్యదర్శి చావ రవి, టీటీఎఫ్‌ నాయకుడు కె.రమణ, వివిధ సంఘాల నాయకులు పద్మశ్రీ, సుధాకర్‌ రావు, ప్రొఫెసర్‌ పురుషోత్తం, బి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top