స్వచ్ఛ సిరిసిల్ల లక్ష్యంగా ప్రణాళికలు

Minister KTR In The Review Meeting Of Sirsilla - Sakshi

ద్రవ,ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత

జిల్లా అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: స్వచ్ఛ రాజన్న సిరిసిల్ల జిల్లా లక్ష్యంగా పారిశుద్ధ్య ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే జిల్లా బహిరంగ మల విసర్జిత రహిత హోదాను (ఓడీఎఫ్‌) సాధించామని, ఇదే స్పూర్తితో పారిశుద్ధ్య ప్రణాళికను అమలు చేయాలన్నారు.ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంకుడు గుంతల (సోక్‌ పిట్స్‌) నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు.

శనివారం హైదరాబాద్‌లో అధికారులతో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. సర్వే ద్వారా స్థలాలు గుర్తించి గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వీటి నిర్మాణం చేపట్టాలన్నారు. మండలం యూనిట్‌గా గ్రామ, వార్డు స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థతో సంప్రదించి ఇంకుడు గుంతల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రఘనందన్‌రావును మంత్రి ఆదేశించారు.జిల్లా పరిధిలో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9 పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, వర్కింగ్‌ ఏజెన్సీలను ఆదేశించారు. మరోవైపు ఇటీవల తెలంగాణకు కేటాయించిన 2017 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారుల బృందం శనివారం  కేటీఆర్‌తో భేటీ అయింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top