చిరుత చిక్కలేదు 

Leopard Left Into The Forest Says Forest Department At Rajendra Nagar - Sakshi

విస్తృతంగా గాలించినా లభించని జాడ

వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో కనిపించిన పాదముద్రలు

చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు నిర్ధారణ  

సాక్షి, హైదరాబాద్, రాజేంద్రనగర్‌: హైదరాబాద్‌ శివార్లలో గురువారం పట్టపగలు నడిరోడ్డుపైకి వచ్చి వాహనదారులు, స్థానికులను హడలెత్తించిన చిరుత పులి ఆచూకీ ఇంకా లభించలేదు. శుక్రవారం వివిధ ప్రాంతాలను జల్లెడ పట్టినా అది కానరాలేదు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు అటవీ, రెవెన్యూ, జూపార్క్, పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా గాలించినా, 25 ట్రాఫిక్‌ కెమెరాల ద్వారా పరిశీలించినా దాని జాడ కనిపించలేదు. రెండు ప్రాంతాల్లో రెండు బోన్‌లను ఏర్పాటు చేసి మేకలను ఎరగా వేసినా అక్కడకు చిరుత రాలేదు.

వర్సిటీలో అడుగుల జాడ.. 
గురువారం నుంచి చిరుత సంచరించిన ప్రాంతాల ఆధారంగా దాని జాడను కనిపెట్టేందుకు పోలీసు శాఖ సహకారంతో అటవీశాఖ అధికారులు విస్తృత కసరత్తు చేశారు. డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించి చివరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత అడుగుల జాడను కనుగొన్నారు. మూసేసిన యూబీ బీర్‌ కంపెనీ వెనుక ప్రాంతంలో చిరుత అడుగుల జాడ కనిపించింది. డాగ్‌ స్క్వాడ్‌ సహకారంతో చిరుత ఏ వైపుగా వెళ్లి ఉంటుందో తేల్చారు. గురువారం సాయంత్రం వరకు అక్కడే ఉండి రాత్రి వ్యవసాయ విశ్వవిద్యాలయం మీదుగా చిలుకూరు అటవీ ప్రాంతం వైపు చిరుత వెళ్లినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ వర్సిటీలో చిరుత అడుగుల జాడ కనిపించిందని, అది ఎక్కడి నుంచి వచ్చిందో అదే దారి గూండా వెళ్లి ఉండవచ్చని, దీనిపై స్థానికులను అప్రమత్తం చేశామన్నారు. అన్మోల్‌ గార్డెన్‌ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన బోన్‌లను అలాగే ఉంచామని, ఒకవేళ చిరుత ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే మేకలను తినేందుకు తప్పకుండా వస్తుందని అధికారులు తెలిపారు.

దట్టమైన ప్రాంతం.. 
వ్యవసాయ విశ్వవిద్యాలయం మొత్తం 2,500 ఎకరాలలో విస్తరించి ఉంది. అలాగే ఫారెస్ట్‌ రేంజ్, గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం, బయోడైవర్సిటీ పార్క్, ఎన్‌ఐఆర్‌డీ, ఆర్‌టీపీ సెంటర్, సౌడమ్మగుట్ట, మానసాహిల్స్, ప్రేమావతిపేట, హిమాయత్‌ సాగర్, కొత్వాల్‌గూడ ప్రాంతాలు మరో 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం గుట్టలు, చెట్లతో నిండుకొని ఉంది. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కష్టంతో కూడుకున్నదని, ఈ ప్రాంతంలోనే చిరుత ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉండొచ్చని అధికారులు అంటున్నారు.

వ్యవసాయ యూనివర్సిటీలో గతంలో బయోడైవర్సిటీ పార్కును, అక్కడి చెరువు చుట్టూ ఉన్న గుట్టలు, దట్టమైన చెట్లు, పొదల వద్ద గుహలను ఏర్పాటు చేశారు. ఎండా కాలంలో సైతం ఈ చెరువు నీటితో కళకళలాడుతోంది. డైవర్సిటీ పార్కు పక్కనే అటవీ ప్రాంతం గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రంతోపాటు చెట్లు, గుట్టలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చిరుత అన్ని విధాలుగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

బిక్కుబిక్కుమంటున్న కాలనీల వాసులు 
చిరుత జాడ తెలియకపోవడంతో పక్కనే ఉన్న బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌ బస్తీ, వేంకటేశ్వర కాలనీ, నేతాజీనగర్, శ్రీరామ్‌నగర్‌ కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

ఒకే ప్రాంతంలో ఉండదు 
ఆహారాన్వేషణలో భాగంగా చిరుత ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుందని, ఒకే ప్రాంతంలో అది ఉండదని, వచ్చిన దారి గుండా తిరిగి వెళ్లిపోతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. గురువారం కనిపించిన చిరుత నాలుగు సంవత్సరాల వయసు ఉంటుందని, దాని కదలికలనుబట్టి అది పూర్తి ఆరోగ్యంతో ఉందని, గాయాలేవీ లేవని వెల్లడించారు. కలవరానికి గురై అది రోడ్డుపైకి వచ్చి ఉండొచ్చన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top